దాడి హేయం.. ఉగ్రవాదులను గెలవనివ్వం: అసద్
న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద శక్తులను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం కానివ్వబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లష్కర్ అయినా, ఐసిస్ అయినా సరే వేటిని పై చేయి సాధించనివ్వబోమని, ఈ విషయంలో దేశమంతా ఐక్యంగా ఉందంటూ స్పష్టం చేశారు.
సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దాడిపై స్పందించిన అసదుద్దీన్ ఉగ్రవాదుల దాడిని హేయమైన చర్య అన్నారు. ఈ దాడి విషయంలో ఏ ఒక్కరు రాజకీయాలు చేయొద్దని సూచించారు. దాడికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఇప్పుడు కాకపోయినా రేపయినా ప్రభుత్వం సమధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.