ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో ఇద్దరిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూపీ పోలీసుల ఛార్జీషీట్‌లో ఆసక్తికర విషయాల్ని పొందుపరిచారు.
లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో సచిన్, శుభమ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని ఓ జాతీయ మీడియా సంస్థ సంపాదించింది. అందులో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లు వెల్లడించింది. ఒవైసీపై దాడిని అంగీకరించిన ఇద్దరు నిందితులు.. వారి దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటో వివరించారు. మరొక వర్గానికి చెందిన ఒక పెద్ద రాజకీయ నాయకుడిని చంపడం ద్వారా ‘హిందుత్వ నేతలు’గా పేరు సంపాదించుకోవాలనే, ఎదగాలనే ఉద్దేశంతోనే ఆ పని చేశారట!.
‘‘పూర్తి సన్నద్ధతతో గౌరవ ఎంపీని లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేశారు. దాడిలో ఎవరైనా గాయపడినా.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ఉండేవి. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు పరిస్థితిని మరింత దిగజార్చేవి’’ అని ఛార్జిషీట్‌లో పోలీసులు పొందుపరిచారు.
ఆధారాలు సమర్పణ
యూపీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ఛార్జ్‌షీట్‌లో ఆధారంగా పేర్కొన్నారు. కారు ఫోరెన్సిక్ పరీక్షల ఫలితంతో పాటు ఇద్దరు నిందితుల స్టేట్‌మెంట్, వాళ్లకు ఆయుధాలు సరఫరా చేసిన వాళ్ల స్టేట్‌మెంట్‌లను సైతం పొందుపరిచారు. ఒవైసీతో పాటు మొత్తం 61 మంది నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్‌ను పొందుపరిచారట.
ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన.. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి పయనమైన ఆయన వాహనంపై.. హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment