'రిగ్గింగ్ కోసం ఎంఐఎం రౌడీలతో దాడి చేయించింది'
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కారుపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎంఐఎం నేతలు రౌడీ మూకల్లా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు మొదలు పెట్టినప్పటినుంచి ఎంఐఎం చార్మినార్ ప్రాంతంలో ఎన్నో ఆగడాలు చేస్తోందని జానారెడ్డి అన్నారు. సాక్షాత్తు ఎన్నికల జరిగే రోజున రిగ్గింగ్ కు పాల్పడేందుకు ప్రయత్నించిందని చెప్పారు. అందుకే హఠాత్తుగా తమ అభ్యర్థిని 2గంటల ప్రాంతంలో అరెస్టు చేయించి పోలీసు స్టేషన్ కు పంపించారని, ఈ విషయం తెలిసి ఆయనను విడిపించేందుకే తమ పీసీసీ చీఫ్ ఉత్తమ్ అక్కడికి వెళ్లారని జానారెడ్డి చెప్పారు.
పోలీసులతో మాట్లాడి, అతడిని విడిపించుకొని బయటకు తీసుకొస్తుండగా, ఎంఐఎం కార్యకర్తలు, గూండాలు దాడికి దిగారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో లా ఆర్డర్ ఉందా లేదా, చట్టబద్ధపాలన చేస్తారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి చర్యలు ప్రజస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తమ్ పై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఎన్నికల కోడ్ ను కూడా ఉల్లంఘించి సైకిలు, మోటారు సైకిళ్లతో తిరుగుతూ ఎన్నికల రోజు కూడా ర్యాలీ మాదిరిగా తిరిగిన అసదుద్దీన్ ఓవైసీ, ఆయన అనుచరులపై చట్టబద్ధ చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై చర్యలు తీసుకుంటారో లేదా తన అధికారమే ముఖ్యమని అనుకుంటారో ఆయన తదుపరి చర్యల ద్వారా స్పష్టం అవుతుందని అన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సంఘటనను ఖండించారు. ఎన్నికల కమిషన్, పోలీసులు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా చోద్యం చూశాయని అన్నారు. సాక్షాత్తు ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి రౌడీ ముఠాను వేసుకొని అసదుద్దీన్ ఎలా తిరిగారని ప్రశ్నించారు.