‘భాయ్ నమస్తే.. మై రామారావు పటేల్. మహేశ్వరరెడ్డి అభీ ఆయా.. పచ్చీస్ దేతూం బోలా. ఆప్ జర ప్రోగ్రాం రోకో..’
‘యే మేరాసే నహీ హోతా సాబ్. ఉనో పచ్చీస్ లాఖ్ నై పచాస్ లాఖ్ బీ దియోతో మై నై కర్‌సక్తా ఓ సాబ్‌కు నై బోల్ సక్‌తూబీ.. ’
భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్,
ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్ మధ్య సాగిన సంభాషణ ఇది.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ‘నేను నిర్మల్ రాకుండా ఉంటే రూ.25 లక్షలు ఇస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చాడు. నన్ను డబ్బులతో కొనలేరు’అని నిర్మల్ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అసద్ వ్యాఖ్యల నేపథ్యంలో జాబీర్ అహ్మద్, రామారావు పటేల్ మధ్య సాగిన ఫోన్‌కాల్ వాయిస్ రికార్డు మంగళవారం లీక్ అయింది. నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణ టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాకుండా ఏం చేయాలనే అంశంపై సాగింది. సభకు అసద్ రాకుండా చేస్తే రూ.25 లక్షలు ఇస్తామని మహేశ్వర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చినట్లుగా రామారావు పటేల్ ఎంఐఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడైన జాబీర్ అహ్మద్‌కు చెప్పడం గమనార్హం. ‘25 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చినా నేనా పని చేయలేను. సాబ్‌ను ఇక్కడికి రా, అక్కడికి పో అని చెప్పేంత శక్తి నాకు లేదు. నేను పార్టీ (ఎంఐఎం)ని నమ్ముకున్నా. మీరు మంచివారు కాబట్టి చెపుతున్నా.. నేనా పని చేయలేను. క్షమించండి’అని జాబీర్ వ్యాఖ్యానించాడు. రూ.25 లక్షలను ఎంఐఎం పార్టీ ఫండ్‌గా జమ చేసేందుకు కూడా సిద్ధమని, ఈ విషయాన్ని అసద్‌కు తెలియజేయాలని రామారావు సూచించినట్లు రికార్డులో ఉంది. అయితే తనతో ఆ పని సాధ్యం కాదని, నేరుగా అసద్ సాబ్ వద్దకే వెళ్లాలని, చాలా మంది కలుస్తుంటారని జాబీర్ సలహా ఇచ్చాడు.
విఠల్‌రెడ్డిని ఓడించేందుకు మీకు సహకరిస్తున్నా..
‘ముథోల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డిని ఓడించేందుకు మీకు సహకరిస్తా. ఇక్కడికి (భైంసా) అసద్ రాకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డా. మీలాంటి మంచివారు గెలవాలి. విఠల్‌రెడ్డి ఓడిపోవాలి. మీ పని అయిపోతుంది. అంతే తప్ప ఐకే రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి కోసం నేను మధ్యవర్తిత్వం చేయను. అలా అసద్ సాబ్‌తో పనులు చేసుకుంటే నేను కోటీశ్వరున్ని అయిపోవాలి. నేనా పనులు చేయను. ఆయన దగ్గర నాకు ఇజ్జత్ ఉంది’అని జాబీర్ స్పష్టం చేశాడు.
బట్టబయలు చేసిన అసద్
తాను నిర్మల్ సభకు రాకపోతే రూ.25 లక్షలు ఇస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చాడని, తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని అసదుద్దీన్ ఒవైసీ సోమవారం రాత్రి నిర్మల్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. డబ్బులతో ఒవైసీని కొనలేరని, మైనారిటీ వర్గాల కోసం పార్టీ పనిచేస్తుందని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇంద్రకరణ్ కుట్ర: మహేశ్వర్‌రెడ్డి
మైనార్టీల మద్దతు తనకుందనే కారణంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని నిర్మ ల్ కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా వచ్చిన జనాన్ని చూసి మతిభ్రమించిన మంత్రి తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. అసదుద్దీన్‌ను తాను ఇప్పటి వరకు స్వయం గా చూడలేదని, ఆయన నిర్మల్‌కు వచ్చినా, రాకపోయినా తనకు నష్టమేమిటని ప్రశ్నించారు. ‘నిర్మల్ పట్టణ మైనార్టీలకు నా గురించి తెలుసు. నాకు పూర్తి మద్ధతిస్తున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో నా ప్రతిష్టను దిగజార్చలేరు’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment