అమరావతిపై మాకొక విజన్ ఉంది | We have a Vision on Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతిపై మాకొక విజన్ ఉంది

Published Sat, Oct 8 2016 1:24 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

అమరావతిపై మాకొక విజన్ ఉంది - Sakshi

అమరావతిపై మాకొక విజన్ ఉంది

- ఒక మెగాసిటీగా, ఆర్థిక శక్తిగా నిర్మించేందుకు ప్రణాళిక
- పట్టణాలన్నీ స్మార్ట్ నగరాలుగా మార్చుతాం
- 2030 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లో నివసించేలా లక్ష్యం
- భారత ఆర్థిక సదస్సులో సీఎం బాబు
 
 సాక్షి, న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలన్నింటినీ స్మార్ట్ నగరాలుగా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిపై తమకొక విజన్  ఉందని, ఒక మెగాసిటీగా, ఆర్థిక శక్తిగా నిర్మించేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్(భారత ఆర్థిక సదస్సు)లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘పట్టణీకరణ వేగవంతంగా సాగుతున్నందున 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా రెట్టింపవనుంది. ఇదొక సవాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం 37.7 కోట్ల మంది భారతీయులు పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ ఆర్థిక వృద్ధి వేగవంతమవుతున్న కొద్దీ పట్టణీకరణ మరింత పెరుగుతుంది. 2031 నాటికి 60 కోట్ల మంది భారతీయులు పట్టణాల్లో నివసిస్తారు.

ముందస్తు ప్రణాళిక లేకుంటే నగరాల్లో మురికివాడలు పెరిగిపోతాయి. అందువల్ల ప్రభుత్వాలు ముందుచూపుతో ఉండాలి. నగరాలు వృద్ధి ఛోదకాలు. ఆంధ్రప్రదేశ్‌లో 2030 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లో నివసించేలా లక్ష్యాన్ని పెట్టుకున్నాం. నగరాలు కేవలం ఉపాధి కల్పించడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలన్నదే మా ఆకాంక్ష. ఆ రకంగా మా నగరాలు స్మార్ట్ నగరాలుగా, హరిత నగరాలుగా, స్థిర ప్రగతి గల నగరాలుగా మారుతాయి. రాజధాని అమరావతి నగరంపై మాకొక విజన్ ఉంది. అవసరాలు తీర్చేదిగా, సమర్థవంతమైన వ్యవస్థలు ఉండేదిగా నూతన రాజధాని ఉంటుంది. 2022 నాటికి దేశంలోని టాప్-3 నగరాల్లో ఒకటిగా ఉండాలన్నది మా విజన్. 2029 నాటికి దేశంలోని అత్యంత సంతృప్తికర రాష్ట్రంగా, 2050 నాటికి అత్యధికులు ఎంచుకునే గమ్యం కావాలన్నదే మా లక్ష్యం’ అని సీఎం పేర్కొన్నారు.

 తయారీ, సేవ రంగాల అనుసంధానంతో రాజధాని వృద్ధి
 విభజన అనంతరం నూతన రాజధానిని అభివృద్ధి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కున్నామని సీఎం అన్నారు. అనేక ఆలోచనల అనంతరం ఒక మెగా సిటీ నిర్మించాలనుకున్నామని, ఇది రాజధానిగానే కాకుండా ఒక ఆర్థిక శక్తిగా మారాలని యోచించామని తెలిపారు. పనిచేస్తున్న ప్రదేశానికి, నివాసానికి ఐదు నిమిషాల్లో నడక ద్వారా చేరగలిగేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు. తయారీ, సేవల రంగాలను అనుసంధానం చేయడం ద్వారా నగరాన్ని వృద్ధి చేస్తామని చెప్పారు. నా ఇటుక, నా అమరావతి కార్యక్రమం ద్వారా ప్రజలను రాజధాని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 56 లక్షల ఇటుకలను రూ. 10 చొప్పున కొనుగోలు చేశారు. దాదాపు 2.26 లక్షల మంది దాతలు అమరావతి నిర్మాణానికి ముందుకొచ్చారు..’ అని వివరించారు.

 పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ..
 సదస్సు అనంతరం బాబు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని వివరించారు. జనరల్ ఎలక్ట్రికల్స్(జీఈ) కంపెనీ వైస్ చైర్మన్ జాన్ రైస్, హెచ్‌పీ కంపెనీ కంట్రీ మేనేజింగ్ డెరైక్టర్ నీలమ్ దవన్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం మేనేజింగ్ బోర్డు సభ్యుడు ఫిలిప్ రోస్లర్, యస్ ఇనిస్టిట్యూట్ సీనియర్ ప్రెసిడెంట్ ప్రీతి సిన్హా తదితరులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కాగా ప్రముఖ వయోలిన్ మాస్టర్ డాక్టర్ ఎల్.సుబ్రమణ్యం, గాయని కవితా కృష్ణమూర్తి సీఎంను కలిసి అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక సంగీత కేంద్రం నె లకొల్పాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement