అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రధాని
న్యూఢిల్లీ: తుపాను ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు. ప్రధాని స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్, టెలికం, రోడ్లు సహా పై-లీన్ పంజా దెబ్బకు ఉత్తరాంధ్ర, ఒడిశాలోని తీర ప్రాంతాలలో దెబ్బతిన్న మౌలిక వ్యవస్థలను పునరుద్ధరించే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు కేంద్ర కేబినెట్ కార్యదర్శి కూడా తాజా పరిస్థితులపై ఆదివారం సమీక్ష నిర్వహించారు.
విపత్తులో ఒడిశాలో 13 మంది, ఆంధ్రాలో ఒకరు మృతి చెందారని తెలిపాయి. రైల్వే, సమాచార వ్యవస్థలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు చెప్పాయి. ఒడిశాలో 7,500 టెలిఫోన్ టవర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 205 టవర్లు దెబ్బతిన్నాయని.. వీటిని 48 గంటల్లోగా పనిచేయించేందుకు బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ అధికారులు రంగంలోకి దిగారు. కేవలం కొన్ని ప్రాంతాలలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్నదని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ లోడ్ సాధారణంగా 10,000 మెగావాట్లు ఉండగా, 9000 మెగావాట్లకు తగ్గిందని, ఒడిశాలో 2,800 మెగావాట్లకు 600 మెగావాట్లుగా ఉన్నట్లు తెలిపింది.