పాక్‌తో దోస్తీనే కోరుకుంటున్నాం
♦ అలాగని ఉగ్రవాదాన్ని ఉపేక్షించం
♦ బిహార్ ఫలితం నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నాం
♦ 2016లో కొత్త వ్యూహాలు.. అస్సాంలో మాదే సర్కారు
♦ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది
♦ ప్రత్యేక హోదాపై యోగ్యమైన నిర్ణయం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్
సాక్షి, న్యూఢిల్లీ: పొరుగుదేశాలతో సత్సంబంధాల కోసం బీజేపీ మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉందని.. అలాగని ఉగ్రవాదం విషయంలో వెనక్కి తగ్గేది లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. బిహార్ ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నామన్న ఆయన.. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును ఆమోదించుకోవటంలో వైఫల్యం, పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి తదితర అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు.
ప్రశ్న: మోదీ ‘స్టాప్ ఓవర్’దౌత్యం వల్ల పరిస్థితులు మెరుగుపడతాయనుకుంటున్నారా?
రాం మాధవ్: ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలుండటం చాలా అవసరం. అందుకే పాకిస్తాన్‌తో సత్సంబంధాల కోసం బీజేపీ అవకాశం ఉన్న ప్రతిసారీ తనవంతు ప్రయత్నం చేస్తోంది. వాజ్‌పేయి లాహోర్ బస్సుయాత్ర చేపడితే.. మోదీ హఠాత్తుగా పర్యటించారు. పాక్‌తో మంచి సంబంధాలనే కోరుకుంటున్నాం.. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. అయితే.. ఉగ్రవాదం విషయంలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.
ప్రశ్న: పఠాన్‌కోట్ ఘటనతో భారత్-పాక్ చర్చల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
రాం మాధవ్: రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేను. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించే విషయంలో మా ప్రభుత్వం అడుగు కూడా వెనక్కువేయదు.
ప్రశ్న: బిహార్‌లో ఓటమి తర్వాత పార్టీ ముందున్న కొత్త సవాళ్లేంటి?
రాం మాధవ్: గతేడాది మిశ్రమ ఫలితాలు సాధించాం. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. ఢిల్లీ, బిహార్‌లలో ఓటమిపాలయ్యాం. వీటినుంచి గుణపాఠం నేర్చుకుంటున్నాం. 2016లో ఎన్నికలు జరిగే అస్సాం, బెంగాల్, తమిళనాడు..తదితర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళతాం. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. పార్టీ వేదికలపై ఎవరైనా తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చు.
ప్రశ్న: ప్రతిపక్షంతో ఘర్షణాత్మక వైఖరితో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందలేదు. దీనిపై మీరేంటారు?
రాం మాధవ్: ప్రజాస్వామ్యంలో అధికార, విపక్షాల మధ్య భేదాభిప్రాయాలు సహజం. కానీ దేశహితం కోరే విషయాల్లో ఇద్దరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. జీఎస్టీని సీఎంలు సమర్థించినా.. రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ అడ్డుకుంటోంది. ఈ విషయంపై ప్రజలే ఆలోచించాలి. బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుపై విపక్షాల మద్దతు పొందే ప్రయత్నం చేస్తాం.
ప్రశ్న: మీరు చేసిన అఖండ భారత్ వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఇది సాధ్యమేనంటారా?
రాం మాధవ్: అఖండ భారత్ ఓ సాంస్కృతిక కల్పనగా చెప్పాను. దీన్ని రాజకీయంగా అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. సరిహద్దులను తుడిచేస్తామని, యుద్ధం చేసి ఇతర దేశాలను ఆక్రమిస్తామనే అర్థంలో కాదు.
ప్రశ్న: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో నీతి ఆయోగ్ నుంచి సానుకూల ఫలితాన్ని ఊహించవచ్చా?
రాం మాధవ్: ప్రత్యేక హోదా విషయంలో నీతి ఆయోగ్ నివేదిక కేంద్రానికి అందింది. యోగ్యమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుంది. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది.