
న్యూఢిల్లీ: వ్యభిచారం కేసుల్లో పురుషుల్ని దోషులుగా, మహిళల్ని బాధితులుగా పరిగణిస్తూ 157 ఏళ్ల కిత్రం రూపొందించిన చట్టం రాజ్యాంగబద్ధతను సమీక్షించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ విషయమై నాలుగు వారాల్లో స్పందనను తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. ఇటలీలో ఉంటున్న భారత పౌరుడు జోసెఫ్ షైన్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.
భర్త అనుమతి లేకుండా భార్య మరో పురుషుడితో శృంగారంలో పాల్గొంటే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్ 497 ప్రకారం దాన్ని వ్యభిచారంగా పరిగణిస్తున్న విషయాన్ని సుప్రీం గుర్తుచేసింది. ఒకవేళ మరో పురుషుడితో శృంగారానికి తన భార్యను భర్త అనుమతిస్తే అది వ్యభిచారం కాదని చట్టంలో ఉండటం భార్యను ఓ వస్తువుగా మార్చడమేనని అభిప్రాయపడింది.
ఇది రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కుకు, లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. భర్త కాకుండా మరో పురుషుడితో భార్య శృంగారంలో పాల్గొన్నప్పుడు సదరు వ్యక్తితో పాటు ఆమెకూ శిక్ష విధించకపోవడాన్ని సమీక్షిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. సెక్షన్ 497 మహిళల పట్ల సానుకూలంగా ఉందనీ.. ఇది ప్రాథమిక హక్కుల్ని, లింగ సమానత్వాన్ని ఉల్లంఘిస్తోందని విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment