
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వెబ్ సైట్లపై నిషేధం
న్యూఢిల్లీ: భారత్ లో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పథక రచన చేయడానికి యత్నాలు చేయనున్నట్లు ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల సంస్థకు చెందిన వెబ్ సైట్లపై కేంద్ర నిషేధం విధించింది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు ఫేస్ బుక్ , ట్విట్టర్ తో పలు రకాలైన యాభై వెబ్ సైట్లను నిషేధించినట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు సంబంధించిన వెబ్ సైట్ల యూఆర్ఎల్ ని కూడా పూర్తిగా తొలగించింది.
అయితే నిషేధం ఉంచిన వెబ్ సైట్లపై నిఘా ఉంచాలని ఐటీ అధికారులకు, రా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాదులను కోల్ కతా లో అరెస్ట్ చేశారు. తీవ్ర వాదుల నుంచి 25 కేజీల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఉగ్రవాదులు మిలటరీ యూనిఫాంలో ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వారి వద్ద లభించిన ల్యాప్ టాప్ లో కీలక సమాచారం లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.