జాతీయత ఏది? వీరి బిడ్డకు ఎంత కష్టమో.. | what is the baby nationality.. banglore muslim couple tragedy | Sakshi
Sakshi News home page

జాతీయత ఏది? వీరి బిడ్డకు ఎంత కష్టమో..

Published Sat, Oct 7 2017 4:08 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

what is the baby nationality.. banglore muslim couple tragedy - Sakshi

సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని వాణి విలాస్‌ ఆసుపత్రిలో ఓ విదేశీ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం ఆ శిశువు ఏ దేశానికి చెందినదన్న విషయం పై రాష్ట్ర పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్‌ శిహాబ్‌ 2010లో దుబాయ్‌కు వెళ్లి అక్కడ నిర్మాణ రంగంలో కార్మికుడిగా పనిచేసేవాడు. అక్కడే ఉపాధి కోసం పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చిన సమిరా అబ్దుల్‌ రెహమాన్‌ అనే యువతి మహ్మద్‌ శిహాబ్‌కు పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. అయితే ఇందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరు మరో ఇద్దరు పాకిస్తాన్‌కే చెందిన వ్యక్తులతో కలిసి మొదట నేపాల్‌కు అటు పై పశ్చిమబెంగాల్‌కు అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.

వీరంతా కలిసే ఉంటూ చిన్నచిన్న కూలి  పనులు చేసుకునేవారు. ఈ ముగ్గురుకి మహ్మద్‌ శిహాబ్‌ నకిలీ ఆధార్‌ కార్డు కూడా సంపాధించిపెట్టారు. ఇదిలా ఉండగా మే నెలలో నగర పోలీసులు ఓ కారు దొంగతనం కేసులో దర్యాప్తు చేస్తుండగా కుమారస్వామి లే అవుట్‌లో  పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు అక్రమంగా నివాసం ఉంటున్న విషయం బయటపడింది. దీంతో సమిరా అబ్దుల్‌ రెహమాన్, శిహాబ్‌తోపాటు మిగిలిన వారిని కూడా అరెస్టు చేసి తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అరెస్టు సమయంలో సమిరా అబ్దుల్‌ రెహమాన్‌ గర్భిణి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 18న సమిరా ప్రసవం కోసం వాణి విలాస్‌ ఆసుపత్రికి చేరగా మరుసటి రోజు అంటే సెప్టెంబర్‌ 19న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డ బరువు తక్కువగా ఉండటంతో ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆమె వాణి విలాస్‌ ఆసుపత్రిలోనే ఉన్నారు.

నిబంధనలు ఏమి చెబుతాయి...
ద సిటిజన్‌ షిప్‌ యాక్ట్‌ 1955 ప్రకారం ‘2004 డిసెంబర్‌ 3 తర్వాత భారత దేశంలో పుట్టే ప్రతి శిశువు భారతీయుడు లేదా భారతీయురాలుగానే పరిగణిస్తారు. అయితే సదరు శిశువు తల్లిదండ్రులు ఇద్దరూ లేదా ఇద్దరిలో ఒకరు భారతీయుడై ఉండాలి. మరొకరు అక్రమంగా వలసవచ్చిన వారై ఉండ కూడదు. అయితే, తాజా ఘటనలో శిహాబ్‌ భారతీయుడైనా ఆయన భార్య సమిరా అక్రమంగా వలస వచ్చిన మహిళ. అందువల్ల సదరు బిడ్డ జాతీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్తాన్‌కు పంపలేమా?
భారతదేశంలో ఎవరైనా విదేశీయులు అక్రమంగా నివశిస్తున్నట్లు తేలితే వారిని ఫారినర్స్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అప్పగించి అక్కడి నుంచి సదరు వ్యక్తి స్వదేశానికి పంపించవచ్చు. అయితే అక్రమంగా ఆధార్‌ కార్డు కలిగి ఉండటం, అక్రమంగా భారత భూభాగంలో నివశిస్తుండటం తదితర తొమ్మిది నేరాలు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీఎసీ) ప్రకారం సమిరాతోపాటు మరో ఇద్దరిపై మోపారు. విదేశీ వ్యక్తి ఏదేని కేసులో విచారణ ఎదుర్కొంటుంటే సదరు విచారణ పూర్తయ్యేంత వరకూ ఆ వ్యక్తి దేశం దాటి వెళ్లడానికి లేదు. దీంతో ప్రస్తుతానికి సమిరా ఇక్కడి జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ తొమ్మిది కేసుల విషయం తేలడానికి సంవత్సరాల వ్యవధి పడుతుందని పోలీసులే చెబుతున్నారు.

బిడ్డను ఎక్కడ ఉంచాలి?
ఈ విషయమై జైలు అధికారులు సంబంధిత తల్లితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉంది. బిడ్డను కొద్ది నెలలపాటు తల్లితోనే ఉంచి అటుపై శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించవచ్చు. తండ్రి మహ్మద్‌ శిహాబ్‌కు సదరు బిడ్డను అప్పగించే విషయంపై కూడా కూడా జైలు, పోలీసు అధికారులు న్యాయనిపుణుల సలహాలు తీసుకులే ఆలోచనలో ఉన్నారు.

వైద్యం అందించవచ్చా?
ఒకవ్యక్తి మెడికల్‌ ఎమర్జెన్సీలో వైద్యుని దగ్గరకు వచ్చినప్పుడు మిగిలిన విషయాలు వదిలి అతని ప్రాణం కాపాడే విషయంపై వైద్యులు దష్టి సారించాలని వైద్య నిబంధనలు చెబుతాయి. ఈ క్రమంలోనే సమిరా అబ్దుల్‌ రెహమాన్‌కు వైద్యం అందిచామని వాణి విలాస్‌ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement