రాజధాని ఎక్స్‌ప్రెస్ నుంచి దురంతో వరకూ...
రాజధాని ఎక్స్‌ప్రెస్ నుంచి దురంతో వరకూ...
Published Tue, Aug 29 2017 6:19 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM
న్యూఢిల్లీః రైలెక్కితే గమ్యస్ధానానికి క్షేమంగా చేరుకుంటామో..లేదోనని ప్రయాణీకులు బిక్కుబిక్కుమని గడపాల్సిన పరిస్థితి. రైళ్లు ఢీకొనడం, లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదం, పట్టాలు తప్పడం..ఇలా ఏ రూపంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళన సగటు జీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2015-16లో జరిగిన రైలు ప్రమాదాల్లో అత్యధికంగా 60 శాతం ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం వల్ల కాగా, 33 శాతం లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
భారత రైల్వేలో భద్రత అతిపెద్ద సవాల్‌గా ముందుకొస్తున్నది. గత కొన్నేళ్లుగా మొత్తం రైలు ప్రమాదాల సంఖ్య కొద్దిగా తగ్గినా..వాటి సంఖ్య మాత్రం 100 పైనే ఉంది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న దురంతో ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటన సహా రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే భద్రతకు ఎదురువుతున్న సవాళ్లు ఆందోళనకు గురిచేసేవే....
రైళ్లు పట్టాలు తప్పడం..
దేశంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాల్లో సింహభాగం రైలు పట్టాలు తప్పడం వల్లనే జరుగుతున్నాయి. ఉత్తరాదిలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదాలకు కూడా ఇదే కారణమని భావిస్తున్నారు. మొత్తం లక్షా14వేల997 కిమీ రైల్వే ట్రాక్‌లో ఏటా 4500 కిమీ మేర ట్రాక్‌ను పునరుద్ధరించాలి. అయితే 2015-16లో 5000 కిమీ ట్రాక్‌ను పునరుద్ధరించాల్సి ఉండగా కేవలం 2700 కిమీ ట్రాక్‌లోనే పునరుద్ధరణ పనులు జరపాలని నిర్ధేశించారు. మరోవైపు పట్టాలు తప్పిన సందర్భాల్లో కోచ్‌లు ఒకదానిపై ఒకటి పడకుండా ఉండేందుకు లింకే హాఫ్‌మాన్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు అమలుకు నోచుకోలేదు.
కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు
రైలు ప్రమాదాల్లో ఎక్కువ ప్రాణనష్టాలకు కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు ఇప్పటికీ కారణమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ఇప్పటికీ 14,440 కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌లున్నాయి. 2014-15లో 40 శాతం రైలు ప్రమాదాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి. 2015-16లో వీటి సంఖ్య 28 శాతంగా నమోదైంది. కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌లను తొలగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యాలు కార్యాచరణకు నోచుకోలేదు.
కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద రైళ్లు వచ్చే సమయంలో రోడ్డుపై వెళ్లేవారిని అప్రమత్తం చేసేలా ఆడియో,విజువల్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ చేసిన సూచనను పరిగణనలోకి తీసుకోలేదు.
రైల్వే సిబ్బంది వైఫల్యంతో....
రైల్వేల్లో భద్రతను సమీక్షిస్తూ రైలు ప్రమాదాల్లో యాభై శాతం పైగా సిబ్బంది వైఫల్యాల వల్లే సంభవిస్తున్నాయని స్టాండింగ్ కమిటీ నిగ్గుతేల్చింది. పనిపట్ల నిర్లక్ష్యం కనబరచడం, పేలవమైన మెయింటెనెన్స్ వర్క్, భద్రతా నిబంధలను గాలికొదిలేయడం వంటి కారణాలను కమిటీ ఎత్తిచూపింది. ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే సిబ్బందికి విభాగాల వారీగా వర్క్‌షాపులు నిర్వహించాలని సూచించింది. ఇక లోకో పైలట్లు ( ట్రైన్ ఆపరేటర్లు)చేసే సిగ్నలింగ్ పొరపాట్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది.
లోకో పైలట్ల విధినిర్వహణలో సమర్ధంగా పనిచేసేందుకు అవసరమైన సాంకేతిక మద్దతు కొరవడింది. వీరు సమయానికి మించి పనిచేయాల్సి రావడంతో లోకో పైలట్లపై పనిభారం, ఒత్తిడి వేలాది ప్రయాణీకుల ప్రాణాలను రిస్క్‌లో పడవేస్తున్నది.లోకోపైలట్లకు మెరుగైన వైద్య వసతులు, పని పరిస్థితులను కల్పించాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది.
నిధుల లేమితో భద్రతకు గండి
రైల్వేలు భద్రతపై భారీ మొత్తం వెచ్చించాల్సిన క్రమంలోనిధుల సమస్య ప్రధాన అవాంతరంగా ముందుకొస్తున్నదని పలు కమిటీల నివేదికలు స్పష్టం చేశాయి. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని రైల్వేలపై స్టాండింగ్ కమిటీ సహా అనిల్ కకోద్కర్ కమిటీ సైతం నొక్కిచెప్పింది. కకోద్కర్ కమిటీ 2012-17 వరుకూ రైల్వేలు భద్రతపై రూ లక్ష కోట్లు వెచ్చించాలని పేర్కొంది.
మొత్తంమీద గత కొన్నేళ్లుగా రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినా వాటి సంఖ్య 100కు పైగానే ఉండటం రైల్వే అధికారులు, పాలనా యంత్రాగం, ప్రయాణీకులను కలవరపరుస్తున్నది.
Advertisement