
ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ
ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అన్న సంఘ్‌పరివార్ కల నెరవేరి జమ్ము కశ్మీర్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 370 ఆర్టికల్ రద్దవడంతో పాటు మంచుఖండాన్ని రెండుభాగాలుగా విభజించే బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇక జమ్ము కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు కానుండడంతో అక్కడ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో అన్న చర్చ మొదలైంది. ప్రధానంగా ఇన్నాళ్లూ కశ్మీర్ లోయను తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేసిన అబ్దుల్లా, ముఫ్తీ వంశాల భవిష్యత్ ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీలు ‘ప్రజాస్వామ్యానికే ఇది చీకటి రోజని, రాజ్యాంగానికి తూట్లు పొడిచారు’ అని ఆర్టికల్ 370 రద్దుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా భవిష్యత్‌లో రాజకీయంగా వారికి ఎలాంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాయనే విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీపైనే పీడీపీ ఆధారపడాల్సి వచ్చింది. జమ్ము, లదాఖ్‌లో ప్రజలు దశాబ్దాల తరబడి హింసాకాండతో విసిగివేసారిపోయారు. శాంతి స్థాపన, అభివృద్ధిని వారు ఆకాంక్షిస్తున్నారు. దీంతో ఎన్‌సీ, పీడీపీలు రాజకీయాలు కేవలం కశ్మీర్ లోయకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జమ్మూలో సీట్లు పెరిగితే..
కశ్మీర్ లోయతో పోల్చి చూస్తే జమ్మూ అతి పెద్ద ప్రాంతం. జనాభా పరంగా కూడా పెద్దది. కేంద్రం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడంతో అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. జమ్మూ ప్రాంతంలోనే 10–15 సీట్లు పెరిగితే రాజకీయా లు బీజేపీకి అనుకూలంగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమ్ము ప్రాంతాన్ని క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహాలు పన్నుతున్న కమలనాథులు కశ్మీరీయేతర హిందూ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కూడా యోచిస్తున్నారు.
పీడీపీ, ఎన్‌సీ చేతులు కలిపితే...
అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆ రెండు పార్టీలు చేతులు కలుపుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోయలో వేర్పాటు వాదులతో చేతులు కలిపి విధ్వంసం సృష్టించడం, బీజేపీని ఎదుర్కోవడానికి కలసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం వంటి చర్యలు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఈ రెండు పార్టీల పాత్ర నామమాత్రంగానే ఉంటుందనే భావన ఉంది. ఎందుకంటే కేంద్రపాలితం కావడంవల్ల శాంతి భద్రతలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉంటాయి. పాలనలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జోక్యం ఉంటుంది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో పోరాటం చేయడం మినహా వారికి వేరే మార్గం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment