
వాట్సప్, సోషల్ మీడియా బ్లాక్!
దళితులు, ఠాకూర్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సహారన్‌పూర్ ప్రాంతంలో ఇంటర్‌నెట్ సర్వీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపేసింది.
దళితులు, ఠాకూర్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సహారన్‌పూర్ ప్రాంతంలో ఇంటర్‌నెట్ సర్వీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపేసింది. సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్‌సైట్లలో లేనిపోని వదంతులు పుట్టించడం వల్ల కులపరమైన ఘర్షణలకు ఆజ్యం పోసినట్లు అవుతోందని, తాత్కాలికంగా కొంతకాలం పాటు ఇంటర్‌నెట్ సేవలను ఆపేయడంతో పాటు వాట్సప్ తదితర సోషల్ మీడియాను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. 2013లో కూడా ముజఫర్‌నగర్‌లో అల్లర్లు చెలరేగి 60 మంది మరణించడానికి వాట్సప్‌లో షేర్ అయిన సందేశమే కారణమని తేలింది. అంతేకాదు, ఇటీవల అసోంలో ముస్లిం పిల్లలకు ఇంపొటెన్సీ టీకాలు వేస్తున్నారంటూ వదంతులు వాట్సప్‌లో వ్యాపించడంతో పిల్లలను స్కూళ్లకు పంపడమే మానుకున్నారు. జార్ఖండ్‌లో పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగులు వచ్చాయంటూ వదంతులు వాట్సప్‌లోనే రావడంతో, ఏడుగురు వ్యక్తులను గిరిజనులు కొట్టి చంపేశారు. ఇలాంటి సమయాల్లో ఇంటర్‌నెట్ మొత్తాన్ని నిషేధించడం మినహా మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
ఒకప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా మాత్రమే సామాజిక ఉద్యమాలకు ప్రచారం జరిపేవారు. కానీ ఇప్పుడు ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ సందేశాలు చాలా తక్కువ సమయంలోనే విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎక్కడైనా పెద్ద స్థాయిలో అల్లర్లు చెలరేగాయంటే, అందుకు కారణం చాలావరకు సోషల్ మీడియానే అవుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో 16 కోట్ల మంది వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. పైగా, ఇందులో పంపే సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అయి ఉంటున్నాయి. అంటే పంపినవారికి, అందుకున్న వారికి తప్ప మధ్యలో ఎవ్వరికీ ఆ సందేశాలు కనిపించే అవకాశమే లేదు. వ్యక్తిగత రహస్యాల దృష్ట్యా ఇది కొంతవరకు మంచిదే అయినా, సామాజిక భద్రత దృష్ట్యా చూస్తే మాత్రం అసలు వాట్సప్ లాంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లు ఎంతవరకు అవసరం అన్న ప్రశ్న రాక తప్పదు. 16 కోట్ల మంది పరస్పరం పంపుకొనే సందేశాలు, గ్రూపుల ద్వారా ఒకేసారి పెద్దమొత్తంలో వెళ్లే సందేశాలను పర్యవేక్షించడం ఎవరికైనా అసాధ్యమే. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ మీడియా రీచ్ తక్కువగా ఉన్నచోట్ల ఇలాంటి సోషల్ మీడియా వ్యాప్తి మరీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి చోట్ల వదంతులకు సులభంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అసలు వాట్సప్ లాంటి వాటిని ఎంతవరకు కొనసాగించాలి, వాటి అవసరం ఏ మేరకు ఉందన్న విషయాలపై జాతీయస్థాయిలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.