Saharanpur riots
-
మహిళా రక్షణ మాతోనే సాధ్యం
సహరన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఏ ముస్లిం మహిళా అణచివేతకు గురికాకూడదనే ఆదిత్యనాథ్ ప్రభుత్వం కోరుకుంటోందని, కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం చేయడంలో యూపీ సీఎం యోగీ పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యూపీలో మహిళలకు రక్షణ కావాలన్నా, నేరస్థులు జైళ్లలో ఉండాలన్నా... బీజేపీ అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొట్టమొదటి సారి యూపీలో ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహరన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ర్యాలీనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు ఒక కళంకం అయితే, 2014లో జరిగిన సహరన్పూర్ మత కల్లోహాలు మరింత భయంగొల్పాయని, వాటికి కారణమైన వాళ్లకు 2017లోనే ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని కితాబిచ్చారు. పేద ప్రజలు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా, చిన్న రైతులకు కిసాన్యోజన నిధులు రావాలన్నా, ఉచిత రేషన్ అందాలన్నా, టీకా ఉచితంగా అందాలన్నా, పక్కా ఇళ్లు ఇవ్వాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, అది యూపీ ప్రజలు గుర్తించారని తెలిపారు. ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చిందన్నారు. బిపిన్‌రావత్ కటౌట్ వాడుకుంటున్నారు... ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని పాల్గొని ప్రసంగించారు. దివంగత జనరల్ బిపిన్ రావత్ బతికుండగా నిందించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకోసం ఆయన కటౌట్‌ను ఉపయోగించుకుంటోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, ఢిల్లీలో ఉండి రుజువులు కావాలని అడిగిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సాయుధ దళాలపై విద్వేషం వెల్లగక్కిన నేతలు ఇప్పుడు వారి చిత్రాలను ఉపయోగించుకోవడం హాస్యాస్పదమన్నారు. బిపిన్‌రావత్ జ్ఞాపకాలను కొనియాడిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. నెహ్రూ వల్లే గోవా విముక్తి ఆలస్యం పండిట్ జనవహర్‌లాల్ నెహ్రూ పట్టుబడితే... 1947లో కొన్ని గంటల్లోనే గోవా, పోర్చుగీసు నుంచి విముక్తమయ్యేదని, కానీ ఆయన నిర్లక్ష్యం వల్లే 15ఏళ్ల కాలం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మపుసలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీ గోవాను శత్రువులా చూస్తోందని, భవిష్యత్‌లోనూ అదే తీరు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. గోవా యువత ఏం కోరుకుంటోంది? ఇక్కడి రాజకీయ సంస్కృతి ఏమిటన్నది కాంగ్రెస్‌కు ఎప్పటికీ అర్థం కాదన్నారు. -
దళితుల బిడ్డల పెళ్లికి ఠాకూర్లే పెద్దలు!
ఒకవైపు సహారన్పూర్ జిల్లా దళితులు - ఠాకూర్ల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఒకరినొకరు చంపుకోవడం, గృహదహనాల లాంటివి అక్కడ జరుగుతున్నాయి. అయితే, ఈ అల్లర్లకు కేంద్రస్థానమైన షబ్బీర్‌పూర్ గ్రామంలో ఇద్దరు దళిత యువతుల పెళ్లిళ్లకు ఠాకూర్ల కుటుంబ సభ్యులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. షబ్బీర్పూర్కు చెందిన ఫకీర్ చంద్ కుమార్తెలు ప్రీతి, మనీషా ఇద్దరికీ పెళ్లిళ్లు కుదిరాయి. దీనికి షబ్బీర్‌పూర్ మాజీ ప్రధాన్ ఠాకూర్ ఓం సింగ్, మహేష్పూర్ గ్రామం మాజీ ప్రధాన్ నక్లీ సింగ్ ఇద్దరూ ఈ పెళ్లిళ్లను తమ చేతుల మీదుగా చేయించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, పెళ్లికొడుకులకు తమ ఇళ్లలోనే విడిది ఏర్పాటు చేశారు. కులాల అడ్డంకులను తోసిరాజని, పెళ్లికొడుకుల ఊరేగింపు (బారాత్)ను కళ్యాణమండపం వరకు దగ్గరుండి తీసుకెళ్లి, వాళ్లను సంప్రదాయపద్ధతిలో స్వాగతించారు. ఇరువర్గాలకు చెందిన యువకులు కలిసి బారాత్‌లో డాన్సు చేశారు. గత కొన్ని వారాలుగా కేవలం హింసాత్మక ఘటనలను మాత్రమే చూస్తున్న ఆ గ్రామం కాస్తా ఇప్పుడు ఠాకూర్లు.. దళితులు కలిసి ఒకే పెళ్లిలో బాలీవుడ్ పాటలకు కలిసి డాన్సు చేయడం చూసి ఎంతో సంతోషించింది. వాస్తవానికి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నప్పటి నుంచి పెళ్లి కూతుళ్లు ప్రీతి, మనీషాలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఏం జరుగుతుందోనని ఆందోళనతోనే ఉన్నారు. కానీ, ఇరు వర్గాలకు చెందిన పెద్దలు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. పెళ్లికి ఎలాంటి ఇబ్బంది రాకుండా తాము చూసుకుంటామని ఠాకూర్లు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని.. ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు ప్రయత్నం చేశారు. అది సఫలమైంది కూడా. దానికి పోలీసులు కూడా సహకరించి, తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఏమవుతుందోనని భయపడ్డామని, కానీ ఠాకూర్ల కుటుంబాలే ముందుకొచ్చి పెళ్లిలో పాల్గొనడంతో పాటు తమకు కూడా వీలైనంత సాయం చేశారని ఫకీర్ చంద్ చెప్పారు. -
సరిహద్దు వరకు వచ్చి ఆగిపోయిన రాహుల్
ఠాకూర్లు.. దళితుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగిన ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ ప్రాంతానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు. నగరంలోకి గానీ, జిల్లాలోకి గానీ పోలీసులు ఆయనను అనుమతించకపోవడంతో.. సరిహద్దుల వద్దే ఆయన సమావేశం నిర్వహించారు. ఇంతకుముందు బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చినప్పుడు అక్కడ అల్లర్లు మళ్లీ చెలరేగడంతో రాజకీయ నాయకులెవరినీ అక్కడకు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినా అక్కడకు వెళ్లాలని రాహుల్ పట్టుబట్టగా, ఆయనను సరిహద్దుల వద్దే ఆపేశారు. దాంతో నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్డర్ చెక్‌పోస్టు వద్దే ఆయన బాధిత కుటుంబాలను కలుస్తానన్నారు. సహారన్పూర్ లోపలకు ప్రవేశించడానికి మూడు మార్గాలున్నాయి. ముజఫర్‌నగర్, బదోద్-షామ్లి, పానిపట్ యమునా నగర్.. ఈ మూడు మార్గాలను పోలీసులు ముందుగానే దిగ్బంధించారు. ఇప్పటికీ అక్కడ పరిస్థితి సున్నితంగా ఉండటం వల్లే రాహుల్ గాంధీని సహారన్పూర్కు అనుమతించడం లేదని యూపీ మంత్రి సిద్దార్థనాథ్ సింగ్ చెప్పారు. సహారన్పూర్ పర్యటనకు వచ్చినప్పుడు మాయావతి రెచ్చగొట్టేలా ప్రసంగించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు రాహుల్ వస్తున్నది కూడా కేవలం ఫొటోలతో హడావుడి చేయడానికేనని, ఈ విషయాన్ని ఇలా రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు. ఘర్షణల కేసును సిట్ విచారిస్తుండగా, దీనిపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా వినేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత దాన్ని విచారించవచ్చని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం చెప్పింది. -
‘ఈ దేశానికి మేమే శాసకులం’
‘మేరే సాత్ కహో–హమ్ ఇస్ దేశ్కా శాసక్ హై (నాతో గొంతు కలిపి చెప్పండి. మనం ఈ దేశానికి పాలకులం) అంటూ ‘భీమ్ ఆర్మీ’ నాయకుడు, 30 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ ఇటీవల జంతర్ మంతర్ వద్ద పిలుపునివ్వగానే వేలాది మంది యువకులు ‘హమ్ ఇస్ దేశ్కా శాసక్ హై’ అంటూ నినదించారు. ప్రస్తుతం ఉవ్వెత్తున లేచిన భీమ్ ఆర్మీ ఉద్యమాన్ని ఎలా ఆపాలి లేదా ఎలా తమ సానుకూలంగా మలుచుకోవాలనే అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు అంతర్గత చర్చలు జరపడమే అందుకు సాక్ష్యం. భీమ్ ఆర్మీని ఇప్పటికే బీజేపీ తొత్తు సంస్థగా ఆరోపణలు చేసి నాలుక కరుచుకున్న బీఎస్పీ నాయకురాలు మాయావతి వారిని ఎలా తన వైపు తిప్పుకోవాలనే అంశంపై ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం యూపీకే పరిమితమైన భీమ్ ఆర్మీ ఢిల్లీలో లక్షలాది మంది యువకులతో భారీ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా తాము ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తామన్న సంకేతాలను ఇచ్చింది. లా డిగ్రీ చదివిన చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం, అంటే 2015లో ‘ది గ్రేట్ చామర్స్ ఆఫ్ దడ్కౌలి వెల్కమ్స్ యు’ అన్న బోర్డును ఇంటిముందు వేలాడదీయడం ద్వారా అందరినీ ఆకర్షించారు. ఆయనది సహరాన్పూర్ పరిధిలోని దడ్కౌలి గ్రామమే. ఆయన ఇంటికి దళిత యువకులు ఎక్కువగా రావడం మొదలైంది. దాంతో ఆయన ‘భీమ్ ఆర్మీ’ని ఏర్పాటు చేశారు. దళితులు అభివృద్ధి చెందాలంటే ముందుగా చదువులో రాణించాలని ఆశించిన చంద్రశేఖర్ దళితులకు ఉచితంగా చదువు చెప్పే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో అలాంటివి దాదాపు 300 కేంద్రాలు నడుస్తున్నాయి. ఇంతకాలం చదువు మీదనే దృష్టిని కేంద్రీకరించిన ఈ ఆర్మీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రయ్యాక రాజకీయ, సామాజిక అంశాలపై తమ దృష్టిని కేంద్రీకరించింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో మే 9వ తేదీన ఠాకూర్లకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ర్యాలీ ద్వారా భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ కాస్త ఒక్కసారిగా పెద్ద నాయకుడై చంద్రశేఖర్ ఆజాద్‌గా అభిమానులు పిలుచుకునే స్థాయికి ఎదిగిపోయారు. చంద్రశేఖర్ మాత్రం తనకు తాను రావన్ అని చెప్పుకుంటారు. మే 6న దళితులకు చెందిన 25 గుడిసెలను ఠాకూర్లు దహనం చేయడాన్ని నిరసిస్తూ 9వ తేదీన భీమ్ ఆర్మీ ర్యాలీని నిర్వహించింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా ఠాకూర్ కులానికి చెందినవారు కావడంతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ర్యాలీని అణచివేతలో ఓ దళిత యువకుడు మరణించారు. మే ఐదో తేదీన ఓ ఠాకూర్ యువకుడిని దళితులు కొట్టి చంపడం వల్లనే తాము వారి గుడిసెలను తగులబెట్టామని ఠాకూర్లు అంటున్నారు. ఠాకూర్లపై ఒక్క కేసు కూడా నమోదు చేయని స్థానిక పోలీసులు చంద్రశేఖర్‌పై మాత్రం 24 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. అల్లర్లను అరికట్టడంలో విఫలమయ్యారంటూ జిల్లా కలెక్టర్‌ను, జిల్లా పోలీసు అధికారిని ముఖ్యమంత్రి యోగి విధుల నుంచి సస్పెండ్ చేశారు. జిల్లా బీజేపీ నాయకులను, క్రియాశీలక కార్యకర్తలను కొంతకాలం సహరాన్‌పూర్‌కు దూరంగా ఉండాలంటూ కూడా యోగి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ దశలో చంద్రశేఖర్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తే అనవసరంగా అతను పెద్ద నాయకుడవతారన్నది ఆయన ఆందోళనట. భీమ్ ఆర్మీ తమ ఉనికిని కూడా దెబ్బతీసే ప్రమాదం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ కులాల విభాగం చైర్మన్ కొప్పుల రాజు వ్యాఖ్యానించారు. ఇంతకాలం దళితులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ వచ్చిన జాతీయ పార్టీలకు భీమ్ ఆర్మీ ఓ మేలుకొలుపని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. తీవ్ర అణచివేతకు గురైనప్పుడు, పార్టీలు వారి ప్రయోజనాలను పట్టించుకోనప్పుడు భీమ్ ఆర్మీ లాంటి ఉద్యమాలు పుట్టుకొస్తాయని సీపీఐ సీనియర్ నాయకుడు డి. రాజా వ్యాఖ్యానించారు. భీమ్ ఆర్మీ వల్ల బీజేపీకి కూడా భారీ నష్టమేనేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ పార్టీ నాయకుడు వ్యాఖ్యానించారు. గోరక్షకుల దాడుల వల్ల ఇప్పటికే దళితులు పార్టీకి దూరమవుతున్నారన్నారు. అయినా భీమ్ ఆర్మీ లాంటి ఉద్యమాలు ఏదో ఒక పార్టీని ఆశ్రయిస్తే తప్ప ఎక్కువకాలం మనుగడ సాగించలేవన్నారు. రానున్న గుజరాత్, కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టకొని ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వెళ్లిన చోటల్లా దళితుల గురించే మాట్లాడుతున్నారు. భీమ్ ఆర్మీలోకి మైనారిటీలైన ముస్లిం యువకులను ఆహ్వానించడం రాజకీయ పార్టీలకు కొరుకుడు పడని మరో అంశం. ఇప్పటికే భీమ్ ఆర్మీలో ఏడు శాతం ముస్లిం యువకులు ఉన్నారు. ప్రస్తుతం 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులనే భీమ్ ఆర్మీలోకి తీసుకుంటున్నారు. -
వాట్సప్, సోషల్ మీడియా బ్లాక్!
దళితులు, ఠాకూర్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సహారన్పూర్ ప్రాంతంలో ఇంటర్నెట్ సర్వీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆపేసింది. సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్సైట్లలో లేనిపోని వదంతులు పుట్టించడం వల్ల కులపరమైన ఘర్షణలకు ఆజ్యం పోసినట్లు అవుతోందని, తాత్కాలికంగా కొంతకాలం పాటు ఇంటర్నెట్ సేవలను ఆపేయడంతో పాటు వాట్సప్ తదితర సోషల్ మీడియాను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. 2013లో కూడా ముజఫర్‌నగర్‌లో అల్లర్లు చెలరేగి 60 మంది మరణించడానికి వాట్సప్‌లో షేర్ అయిన సందేశమే కారణమని తేలింది. అంతేకాదు, ఇటీవల అసోంలో ముస్లిం పిల్లలకు ఇంపొటెన్సీ టీకాలు వేస్తున్నారంటూ వదంతులు వాట్సప్‌లో వ్యాపించడంతో పిల్లలను స్కూళ్లకు పంపడమే మానుకున్నారు. జార్ఖండ్‌లో పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగులు వచ్చాయంటూ వదంతులు వాట్సప్‌లోనే రావడంతో, ఏడుగురు వ్యక్తులను గిరిజనులు కొట్టి చంపేశారు. ఇలాంటి సమయాల్లో ఇంటర్నెట్ మొత్తాన్ని నిషేధించడం మినహా మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఒకప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మాత్రమే సామాజిక ఉద్యమాలకు ప్రచారం జరిపేవారు. కానీ ఇప్పుడు ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ సందేశాలు చాలా తక్కువ సమయంలోనే విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎక్కడైనా పెద్ద స్థాయిలో అల్లర్లు చెలరేగాయంటే, అందుకు కారణం చాలావరకు సోషల్ మీడియానే అవుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో 16 కోట్ల మంది వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. పైగా, ఇందులో పంపే సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటున్నాయి. అంటే పంపినవారికి, అందుకున్న వారికి తప్ప మధ్యలో ఎవ్వరికీ ఆ సందేశాలు కనిపించే అవకాశమే లేదు. వ్యక్తిగత రహస్యాల దృష్ట్యా ఇది కొంతవరకు మంచిదే అయినా, సామాజిక భద్రత దృష్ట్యా చూస్తే మాత్రం అసలు వాట్సప్ లాంటి ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్‌లు ఎంతవరకు అవసరం అన్న ప్రశ్న రాక తప్పదు. 16 కోట్ల మంది పరస్పరం పంపుకొనే సందేశాలు, గ్రూపుల ద్వారా ఒకేసారి పెద్దమొత్తంలో వెళ్లే సందేశాలను పర్యవేక్షించడం ఎవరికైనా అసాధ్యమే. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ మీడియా రీచ్ తక్కువగా ఉన్నచోట్ల ఇలాంటి సోషల్ మీడియా వ్యాప్తి మరీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి చోట్ల వదంతులకు సులభంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అసలు వాట్సప్ లాంటి వాటిని ఎంతవరకు కొనసాగించాలి, వాటి అవసరం ఏ మేరకు ఉందన్న విషయాలపై జాతీయస్థాయిలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. -
సహారన్‌పుర్ అల్లర్లకు బీజేపీ కారణం
-
సహారన్‌పుర్ అల్లర్లకు బీజేపీ కారణం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కమిటీ ఆరోపణ తిప్పికొట్టిన బీజేపీ.. రాజకీయ లబ్ధి కోసమేనని ప్రత్యారోపణ బీజేపీ, ఎస్పీలపై ఫైరయిన మాయావతి కమిటీ నివేదికపై మాట్లాడనన్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్ అల్లర్లకు బీజేపీ ఎంపీ ఒకరు కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్ ఆదివారం ఆరోపించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయవాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అది ప్రభుత్వ ప్రేరేపిత నివేదిక అని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. యూపీ మంత్రి శివ్‌పాల్ యాదవ్ నేతృత్వంలో అల్లర్ల కారణాల పరిశీలనకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ఆ ప్యానల్ ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో బీజేపీ ఎంపీ పేరును చేర్చిందని, అల్లర్లలో అధికారుల అలసత్వాన్ని కూడా పేర్కొందని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి నరేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక బీజేపీ ఎంపీ రాఘవ్ లఖన్‌పాల్ రెచ్చగొట్టడం వల్లే గత నెల 26న జరిగిన ఆ అల్లర్లలో ముగ్గురు మృతిచెందారని ప్యానల్ తన నివేదికలో పేర్కొనట్టు సమాచారం. దీనిపై రాంపాల్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక వర్గం మెప్పుపొందడానికే ప్రభుత్వం అథమ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ప్రతినిధి ఎంజె అక్బర్ అన్నారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో మతఘర్షణలు రెచ్చగొట్టడంలో ఆ రెండు పార్టీలకు పాత్ర ఉందని విమర్శించారు. నిజాలను దాచిపెట్టి నివేదిక రూపొందించారని, అందుకే తాము దానిని అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రషిద్ అల్వీ స్పందిస్తూ.. మతోన్మాదానికి తాను వ్యతిరేకం అన్న నరేంద్ర మోడీ మాటలకు కట్టుబడి ఉండి, తమ ఎంపీపై చర్యలుతీసుకోవాలని కోరారు. ఒక రాజకీయ పార్టీ ఏర్పాటుచేసిన కమిటీపై తాను మాట్లాడనని, అయినా తానా రిపోర్టు చూడలేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.