
సహారన్‌పుర్ అల్లర్లకు బీజేపీ కారణం
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్ అల్లర్లకు బీజేపీ ఎంపీ ఒకరు కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్ ఆదివారం ఆరోపించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కమిటీ ఆరోపణ
తిప్పికొట్టిన బీజేపీ.. రాజకీయ లబ్ధి కోసమేనని ప్రత్యారోపణ
బీజేపీ, ఎస్‌పీలపై ఫైరయిన మాయావతి
కమిటీ నివేదికపై మాట్లాడనన్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్ అల్లర్లకు బీజేపీ ఎంపీ ఒకరు కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్ ఆదివారం ఆరోపించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయవాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అది ప్రభుత్వ ప్రేరేపిత నివేదిక అని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. యూపీ మంత్రి శివ్‌పాల్ యాదవ్ నేతృత్వంలో అల్లర్ల కారణాల పరిశీలనకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ఆ ప్యానల్ ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో బీజేపీ ఎంపీ పేరును చేర్చిందని, అల్లర్లలో అధికారుల అలసత్వాన్ని కూడా పేర్కొందని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి నరేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక బీజేపీ ఎంపీ రాఘవ్ లఖన్‌పాల్ రెచ్చగొట్టడం వల్లే గత నెల 26న జరిగిన ఆ అల్లర్లలో ముగ్గురు మృతిచెందారని ప్యానల్ తన నివేదికలో పేర్కొనట్టు సమాచారం. దీనిపై రాంపాల్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక వర్గం మెప్పుపొందడానికే ప్రభుత్వం అథమ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ప్రతినిధి ఎంజె అక్బర్ అన్నారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి.. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో మతఘర్షణలు రెచ్చగొట్టడంలో ఆ రెండు పార్టీలకు పాత్ర ఉందని విమర్శించారు. నిజాలను దాచిపెట్టి నివేదిక రూపొందించారని, అందుకే తాము దానిని అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రషిద్ అల్వీ స్పందిస్తూ.. మతోన్మాదానికి తాను వ్యతిరేకం అన్న నరేంద్ర మోడీ మాటలకు కట్టుబడి ఉండి, తమ ఎంపీపై చర్యలుతీసుకోవాలని కోరారు. ఒక రాజకీయ పార్టీ ఏర్పాటుచేసిన కమిటీపై తాను మాట్లాడనని, అయినా తానా రిపోర్టు చూడలేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.