న్యూఢిల్లీ: అత్యాచారానికి గురై ఓ బిడ్డకు జన్మనిచ్చిన పదేళ్ల బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం అందించే విషయంపై తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ న్యాయ సేవల సంస్థ (ఎన్‌ఎల్‌ఎస్‌ఏ), ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లా న్యాయ సేవల సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ)లకు నోటీసులు జారీ చేసింది.
కేసు విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధిత బాలిక దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెలలో కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక గురువారం బిడ్డకు జన్మనిచ్చింది. ‘పదేళ్ల వయసున్న బాధిత బాలిక.. చిన్నారిని పోషించుకోలేదు. ఆమెకు రూ.10 లక్షల నష్టపరిహారాన్ని అందించండి’ అని న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు విన్నవించారు.