
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ మాత సంస్థ ఆరెస్సెస్ అధినాయకుడు మోహన్ భగవత్ ప్రతిఏటా విజయదశమి రోజున ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగాన్ని శనివారం నాడు ప్రసారభారతి ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ ప్రసారం చేయడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రసారం చేయడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించిన దూరదర్శన్, ఇప్పుడు రాజ్యాంగ లౌకిక భావాలకు వ్యతిరేకంగా మాట్లాడిన భగవత్ ప్రసంగాన్ని ప్రసారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ ప్రసారాల విషయంలో ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఏమేరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మానిక్ సర్కార్ రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడని, అలాంటి వ్యక్తి ప్రసంగానికే అవకాశం ఇవ్వని దూరదర్శన్ రాజ్యాంగ విరుద్ధ భావాలు కలిగిన వ్యక్తి ప్రసంగ ప్రసారానికి అనుమతివ్వడం ఏమిటని హేతువాదులు విమర్శిస్తున్నారు. 2014లో మోహన్ భగవత్ ప్రసంగ ప్రసారానికి దూరదర్శన్ అనుమతివ్వడంపట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకున్నా భగవత్ ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి వీల్లేదు. అయినా ఆయన ప్రసంగాన్ని అనుమతించారంటే స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టిన దూరదర్శన్ కేంద్ర ప్రభుత్వానికి లోబడి పనిచేస్తోందని అర్థం చేసుకోవచ్చు.