పిల్లల ఆకలి కేకలు వినేదెవరు?
న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న ‘అచ్చే దిన్’ ఎవరికి వస్తున్నాయో ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ బుక్కడంత అన్నం కోసం అంగన్‌వాడీలపై ఆధారపడి బతుకుతున్న ఎనిమిది కోట్ల మంది పిల్లలు మాత్రం ‘అన్నమో రామచంద్ర!’ అంటూ ఆకలితో అలమటిస్తున్నారు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు. కనీసం పిల్లల అర్ధాకలిని తీర్చే మార్గం కూడా కనిపించని దరిద్ర పరిస్థితులు నెలకొన్నాయి ఈ దేశంలోనా.
పిల్లలకు పోషక పదార్థాలు అందించడం కోసం సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి పథకాన్ని 1975లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ స్కీమ్ కిందనే గర్భస్త శిశువులకు, ఆరేళ్లలోపు పిల్లల కోసం అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ స్కీమ్ కే టాయింపులను సగానికి సగం తగ్గించడంతో ఈ దారుణ పరిస్థితులు దాపురించాయి.
భారత్‌కన్నా ఎంతో వెనకబడిన పాకిస్తాన్, బంగ్లా, ఆఫ్రికా దేశాలకన్నా మన దేశ పిల్లల్లోనే పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం వేస్తోంది. పాకిస్తాన్‌లో ఈ లోపం 32 శాతం ఉంటే, భారత్‌లో సరాసరి 43 శాతం ఉంది. మోదీ హయాంలో ఒక్క వెలుగు వెలిగిందని చెబుతున్న గుజరాత్‌లోనే 50 శాతంపైగా పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉంది. నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఇదే విషయాన్ని ఆయన ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ‘గుజరాత్‌లో శాకాహారులు ఎక్కువ. అందుకే పౌష్టికాహార లోపం ఎక్కువ ఉంది’ అని సమాధానం ఇచ్చారు. మరి, అలాంటి సందర్భాల్లో గోమాంస నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందో ఆయనకే తెలియాలి!
అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు వేడివేడి వంటకాలతో పౌష్టికాహార భోజనం పెట్టాలి. గత నాలుగు నెలలుగా సద్దన్నం కూడా సరిగ్గా పెట్టలేక పోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. తమకే కాకుండా సూపర్‌వైజర్లకు కూడా గత రెండు నెలలుగా వేతనాలు లేవని పలు రాష్ట్రాల అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో గత నాలుగు నెలలుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతాలు లేవట. రేషన్‌కు, సిబ్బంది జీతాలకు రెగ్యులర్‌గా కాకుండా అడపాదడపా నిధులను విడుదల చేయడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని, పిల్లల ఆరోగ్యమే ముఖ్యమని భావించి వచ్చిన అరకొర నిధులను వెచ్చాలకే వెచ్చిస్తున్నామని ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ అంగన్‌వాడి కార్యకర్త రాజేశ్వరి దేవి తెలిపారు.
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత ఫిబ్రవరిలో 2015-16 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి స్కీమ్‌కు కేవలం 8,335 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతకుముందు ఏడాది 18,681 కోట్ల రూపాయలను కేటాయించారు. అంటే 10,246 కోట్ల రూపాయలను తక్కువగా కేటాయించారు. సంతాన లక్ష్మిగా ఘనతకెక్కిన భారత్‌లో పిల్లల సంఖ్య ఏటేటా పెరుగుతుందే తప్ప తగ్గదుకదా! అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు భోజనం పెట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు వారికి ఆరోగ్య పరీక్షలు జరిపించాలి. ఎదుగుదలను పరీక్షించాలి.
రోగనిరోధక శక్తి పెరగడానికి మందులివ్వాలి. చదువు చెప్పాలి. ఇక స్కీమ్ కింద ఏటేటా కొత్త అంగన్‌వాడీలను ఏర్పాటు చేయాలి. వాటికి మౌలిక సౌకర్యాలు కల్పించాలి. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మేనకా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయగా, కేంద్రం మరో 3,100 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించింది. మిగతా అవసరమైన నిధులను రాష్ట్రాలే భరించాలంటూ ఉత్తర్వులు జారీచేసి చేతులు దులుపుకుంది. పలు రాష్ట్రాలు అప్పటికే బడ్జెట్ కసరత్తును పూర్తి చేయడంతో ఈ స్కీమ్ కింద ప్రత్యేక నిధులను కేటాయించలేక పోయాయి.
1975లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌కు 2010 సంవత్సరం వరకు పూర్తి నిధుల కేటాయింపులను కేంద్రమే భరిస్తూ వచ్చింది. రాష్ట్రాలకు కూడా బాధ్యతను షేర్ చేయడంలో భాగంగా రాష్ట్రాలకు కూడా కొంత వాటాను భరించాల్సిందిగా నిబంధనల్లో మార్పులు చేసింది. అయినప్పటికీ కేంద్రమే ఎక్కువ భారాన్ని మోస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం క్రమక్రమంగా ఈ భారాన్ని పూర్తిగా రాష్ట్రాలపైకే నెట్టివేయడానికి ప్రయత్నిస్తోంది.