
‘జీఎస్టీ’ కోసం ముందుగానే శీతాకాల సమావేశాలు
నవంబర్ తొలి వారంలో జరపాలని కేంద్రం యోచన
న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవల బిల్లుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి అమలుచేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను ఆమోదించేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాస్త ముందుగానే నిర్వహించాలనుకుంటోంది. సాధారణంగా నవంబర్ మూడు, నాలుగో వారాల్లో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి మొదటి వారంలోనే (దీపావళి అయిపోయిన తర్వాత) మొదలుపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం పార్లమెంటు వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వర్షాకాల సమావేశాల్లాగే శీతాకాల సమావేశాలనూ విజయవంతం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అనకున్న సమయానికి సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులకు ఆమోదం పొందితే.. ఆర్థికశాఖ జీఎస్టీని అంత పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం దొరుకుతుంది. వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు 50శాతానికి పైగా రాష్ట్రాలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిల్లుకు అంగీకారాన్ని తెలపగా.. కేంద్రం వెంటనే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కాగా, జీఎస్టీతోపాటు తయారీరంగాన్ని కాపాడుకునేందుకు ఒక్కో ఉత్పత్తికి ఒక్కో పన్ను విధానం (శ్లాబులు) విధించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. అన్ని రంగాలకూ ఒకే రకమైన రేటుతో పన్నులు విధించలేమన్నారు. చిన్న సంస్థలకు కూడా స్థిరమైన జీఎస్టీని అమలు చేయటం ద్వారా అవి మనుగడ సాధించలేవని.. అందువల్ల వీటికి తక్కువ పన్ను విధిస్తామన్నారు. బికనీర్ పాపడ్‌పై కేవలం ఒకశాతం పన్ను మాత్రమే అమల్లో ఉందని మంత్రి తెలిపారు.