
ముఖ్యమంత్రి అభ్యర్థికి బెదిరింపు లేఖ
ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్కు ఆగంతకులు బెదిరింపు లేఖ రాశారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్కు ఆగంతకులు బెదిరింపు లేఖ రాశారు. పోటీ నుంచి తప్పుకోకుంటే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి తరపున సీఎం అభ్యర్థిగా ఆయన పేరు వినబడుతోంది. ఎన్డీఏ కూటమి గనుక గెలిస్తే ప్రేమ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రేమ్ కుమార్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన గయా టౌన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
'పోటీ నుంచి తప్పుకోకపోతే భయంకరమైన పరిమణాలుంటాయి. ఇప్పటివరకు ఎన్నికల కోసం పెట్టిన ఖర్చును కూడా తిరిగిచ్చేస్తాం. ఈ ఎన్నికల్లో గయా టౌన్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న రాజ్ కుమార్ ప్రసాద్ గెలవాలి' అని లేఖలో రాసినట్టు పోలీసులు తెలిపారు.
దీనిపై రాజ్ కుమార్ స్పందిస్తూ... బెదిరింపు లేఖలతో తనను తప్పుడు కేసుల్లో ఇరికించే కుట్ర చేస్తున్నారని, దీనితో ఎలాంటి సంబంధం లేదన్నారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మను మహరాజ్ను కలిసి ప్రేమ్ కుమార్కు పటిష్ట భద్రత కల్పించాలని కోరారు.