భర్త కళ్లెదుటే మహిళపై..
బీడ్: భర్త ఎదుటే మహిళపై దాడి చేసి, నగ్నంగా ఊరేగించిన అనాగరిక ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. బీడ్ జిల్లా వర్న్‌గాల్‌వాది గ్రామంలో శుక్రవారం ఈ దారుణోదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి టీనేజీ బాలికతో సహా 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల కుటుంబానికి చెందిన మహిళతో సంబంధం పెట్టుకోవడానికి సోదరుడికి సహాయం చేసిందన్న అక్కసుతో బాధితురాలిపై ఈ కిరాతకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆగస్టు 2న బాధితురాలిపై భర్త ఎదుటే నిందితులు దాడి చేశారు. వారినిద్దరూ క్షమించమని వేడుకోవడంతో వదిలేసి వెళ్లిపోయారు.
ఆగస్టు 4న ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఇంట్లో ఒంటరిగా ఉన్న బాధితురాలిపై మరోసారి దాడికి తెగబడ్డారు. అక్కడితో ఆగకుండా ఆమె దుస్తులు చించేసి, చెప్పులతో కొడుతూ గ్రామంలో నగ్నంగా ఊరేగించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జిరాయ్ తాలుకాలోని ఛక్లాంబా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టీనేజీ బాలికను జువనైల్ కస్టడీకి తరలించినట్టు బీడ్ ఎస్పీ తెలిపారు. నిందితులు మారుతి సత్లే, బాబన్ సత్లే, అంగద్ ఇంగోల్, కుంతా ఇంగోల్, లంకా సత్లే, రేఖ ఇంగోల్, జాంబర్ దంతల్‌గా గుర్తించారు.