అర్ధరాత్రి అడవిలో సింహాల మధ్య ప్రసవం | Woman Delivers Baby In Ambulance Surrounded By 12 Lions | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అడవిలో సింహాల మధ్య ప్రసవం

Published Sun, Jul 2 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

అర్ధరాత్రి అడవిలో సింహాల మధ్య ప్రసవం

అహ్మదాబాద్‌: ఆమె ఎలాంటి సమస్య లేకుండా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు.  కానీ, ముఖంలో సంతోషానికి బదులు భయాందోళనలు అలుముకున్నాయి. ఏం జరుగుతుందో అని వణికిపోయింది. అందుకు కారణం సింహాలు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పన్నెండు సింహాలు. మొత్తం వారిని చుట్టుముట్టాయి. అదేమిటి బిడ్డకు జననం అంటే ఏ ఇంట్లోనో, ఆస్పత్రిలో ఉంటుందిగా.. అక్కడ సింహాలు చుట్టుముట్టడమేమిటని సందేహ పడుతున్నారా? కానీ, ఇది నిజమే. అయితే, ఆమె అంతా అనుకున్నట్లు ఇంట్లోనో ఆస్పత్రిలోనో బిడ్డకు జన్మనివ్వలేదు. అడవి ప్రాంతంలో ప్రసవించింది.

అది కూడా అర్ధరాత్రి సమయంలో..వివరాల్లోకి వెళితే.,. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోగల లునాసఫూర్‌ అనే ఓ ఏజెన్సీ గ్రామంలో మంగుబెన్‌ మక్వానా అనే 32 ఏళ్ల మహిళ గత నెల (జూన్‌) 29న పురిటి నొప్పులు వచ్చాయి. అప్పుడు సమయం అర్థరాత్రి తర్వాత 2.30 కావొస్తుంది. దాంతో ఆమెను జఫరాబాద్‌ టౌన్‌ ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌ వచ్చింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేది సింహాలకు ప్రసిద్ధిగాంచిన గిర్‌ ఫారెస్ట్‌ ప్రాంతం నుంచే. దీంతో వారు వెళ్లే సమయంలో అదే మార్గంలో తొలుత మూడు సింహాలు వారి వాహనాన్ని అడ్డగించాయి. ఆలోపే వరుసగా పన్నెండు సింహాలు వారి వాహనాన్ని చుట్టుముట్టాయి. స్థానికులకు అక్కడి సింహాలు పారిపోయేలా చేయడం తెలిసినందున అలాంటి సంకేతాలు ఇచ్చారు.

వారి దురదృష్టం కొద్ది ఆ సింహాలు పారిపోవడానికి అటు ఇటు తిరగడం ఆపేసి ఏకంగా వాహనం ముందు కూర్చున్నాయి. ఈలోగా పురిటి నొప్పులు మరింత పెరగడంతో అంబులెన్స్‌లోని సిబ్బంది ఓ ప్రధాన వైద్యుడికి ఫోన్‌ చేసి అతడు చెప్పిన ప్రకారం పాటిస్తూ ఆమెకు అంబులెన్స్‌లోనే పురుడు పోశారు. అంబులెన్స్‌ నడుపుతున్న డ్రైవర్‌ జాదవ్‌ మాత్రం సింహాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉన్నాడు. ఆ తర్వాత బిడ్డ జన్మించాక మెల్లిగా అంబులెన్స్‌ కదిలిస్తూ లైట్‌లు ఆన్‌ ఆఫ్‌ చేస్తూ ముందుకెళ్లడంతో సింహాలు దారిచ్చాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement