Woman Delivers Baby
-
ఒకే కాన్పులో జంట కవలలు, కోటిమందిలో ఒక్కరికి మాత్రమే ఇలా!
కవలలను సాకడం తల్లిదండ్రులకు ఎంతో కష్టం. అలాంటిది ఒకేసారి కవలల జంట పుడితే! బాప్రే అనుకుంటున్నారా? అలాంటి అరుదైన ఘటన బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో జరిగింది. యాష్లీ నెస్ అనే మహిళకు ఒకే కాన్పులో ఒకేతీరుగా ఉన్న ఇద్దరు కవలల (ఐడెంటికల్ ట్విన్స్) జంట జన్మించారు. ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు... మొత్తానికి నలుగురు పిల్లలు జూలై 28న పుట్టారు. కోటిమందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఇచ్చిన కాన్పు తేదీ కంటే.. పన్నెండువారాలు ముందుగా పుట్టారు. ఇలాంటి ‘కోటిలో ఒక్కరు’ఇంతకుముందు కూడా జరిగాయి. కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ... 15 నిమిషాల తేడాతో కవలలకు జన్మనిచ్చింది. ముందుగా బాబు 2021 డిసెంబర్ రాత్రి 11.45 గంటలకు జన్మిస్తే... 15 నిమిషాల తరువాత.. అంటే 2022 జనవరి ఒకటిన అర్ధరాత్రి పన్నెండుకు పాప జన్మించింది. ఇండియానాలోనూ 2019 డిసెంబర్ 31న ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది... కాకపోతే పిల్లలిద్దరికి అర్థగంట తేడా అన్నమాట. -
సింహాల మధ్య బిడ్డకు ప్రసవం
గాంధీనగర్ : అప్పుడే పుట్టిన ఈ పాపకు ‘సింహ బాలిక’ అనే పేరు సందర్భోచితంగా ఉండొచ్చు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్‌లో రహదారిపై చిమ్మ చీకటిలో సింహాల నడుమ బిడ్డను ప్రసవించింది ఓ తల్లి. కంగారు పడకండి. ఆ తల్లి అంబులెన్సులోనే ఉంది. నొప్పులు పడుతుంటే అంబులెన్సు ఆమెను ఇంటì నుంచి ఆసుపత్రికి వెళుతుండగా నాలుగు సింహాలు రోడ్డుకు అడ్డంగా వచ్చి అక్కడే ఉండిపోయాయి. ఇరవై నిముషాల సేపు అవి కదల్లేదు. ఈలోపు అంబులెన్సులోనే ప్రసవం జరిగిపోయింది. తల్లీబిడ్డ క్షేమం. తల్లి పేరు అఫ్సానా. -
మానవత్వం చాటిన రైల్వే సిబ్బంది..
బిట్రగుంట : శ్రీ పొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్లో శనివారం ఓ ప్రయాణికురాలికి ప్రసవమైంది. రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి మానవత్వంతో సపర్యలు చేయడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఆస్పత్రికి చేరారు. అస్సాం రాష్ట్రం డౌలాపూర్‌కు చెందిన నిండు చూలాలు తారామతిభార్ బెంగళూరు నుంచి గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో వెళుతోంది. రైలు నెల్లూరు దాటాక ఆమెకు ఒక్కసారిగా ప్రసవం నొప్పులు అధికమయ్యాయి. అంతలోనే రైలు బిట్రగుంట స్టేషన్‌కు చేరుకుంది. లైన్ క్లియర్ లేని కారణంగా రైలును స్టేషన్లో కొద్దినిమిషాలపాటు నిలిపారు. అప్పటికే నొప్పులు తీవ్రమవడంతో తట్టుకోలేక రైలు దిగేసిన తారామతి ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫాంపై మగబిడ్డను ప్రసవించింది. అనంతరం రక్తస్రావం కారణంగా అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన టీఎక్స్ఆర్ అధికారి జయానంద్, సిబ్బంది అరుణ్‌కుమార్, సురేష్ తదితరులు వెంటనే 108కు, రైల్వే డాక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు సీఎన్‌డబ్ల్యూ సిబ్బంది లావణ్య, శారదమ్మను పిలిపించారు. వెంటనే అక్కడకు చేరుకున్న మహిళా సిబ్బంది బిడ్డ శరీరాన్ని శుభ్రం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లికి సపర్యలు చేయడంతో ఆమె కోలుకుంది. రైల్వే వైద్యురాలు హసీనాబేగం వచ్చి తల్లీబిడ్డలను పరీక్షించి ప్రమాదం లేదని చెప్పారు. తల్లికి రక్తస్రావం అధికంగా ఉండటంతో 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. తారమతి వద్ద లభించిన ఆధార్‌కార్డ్, ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
అర్ధరాత్రి అడవిలో సింహాల మధ్య ప్రసవం
అహ్మదాబాద్: ఆమె ఎలాంటి సమస్య లేకుండా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ, ముఖంలో సంతోషానికి బదులు భయాందోళనలు అలుముకున్నాయి. ఏం జరుగుతుందో అని వణికిపోయింది. అందుకు కారణం సింహాలు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పన్నెండు సింహాలు. మొత్తం వారిని చుట్టుముట్టాయి. అదేమిటి బిడ్డకు జననం అంటే ఏ ఇంట్లోనో, ఆస్పత్రిలో ఉంటుందిగా.. అక్కడ సింహాలు చుట్టుముట్టడమేమిటని సందేహ పడుతున్నారా? కానీ, ఇది నిజమే. అయితే, ఆమె అంతా అనుకున్నట్లు ఇంట్లోనో ఆస్పత్రిలోనో బిడ్డకు జన్మనివ్వలేదు. అడవి ప్రాంతంలో ప్రసవించింది. అది కూడా అర్ధరాత్రి సమయంలో..వివరాల్లోకి వెళితే.,. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోగల లునాసఫూర్ అనే ఓ ఏజెన్సీ గ్రామంలో మంగుబెన్ మక్వానా అనే 32 ఏళ్ల మహిళ గత నెల (జూన్) 29న పురిటి నొప్పులు వచ్చాయి. అప్పుడు సమయం అర్థరాత్రి తర్వాత 2.30 కావొస్తుంది. దాంతో ఆమెను జఫరాబాద్ టౌన్ ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ వచ్చింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేది సింహాలకు ప్రసిద్ధిగాంచిన గిర్ ఫారెస్ట్ ప్రాంతం నుంచే. దీంతో వారు వెళ్లే సమయంలో అదే మార్గంలో తొలుత మూడు సింహాలు వారి వాహనాన్ని అడ్డగించాయి. ఆలోపే వరుసగా పన్నెండు సింహాలు వారి వాహనాన్ని చుట్టుముట్టాయి. స్థానికులకు అక్కడి సింహాలు పారిపోయేలా చేయడం తెలిసినందున అలాంటి సంకేతాలు ఇచ్చారు. వారి దురదృష్టం కొద్ది ఆ సింహాలు పారిపోవడానికి అటు ఇటు తిరగడం ఆపేసి ఏకంగా వాహనం ముందు కూర్చున్నాయి. ఈలోగా పురిటి నొప్పులు మరింత పెరగడంతో అంబులెన్స్‌లోని సిబ్బంది ఓ ప్రధాన వైద్యుడికి ఫోన్ చేసి అతడు చెప్పిన ప్రకారం పాటిస్తూ ఆమెకు అంబులెన్స్‌లోనే పురుడు పోశారు. అంబులెన్స్ నడుపుతున్న డ్రైవర్ జాదవ్ మాత్రం సింహాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉన్నాడు. ఆ తర్వాత బిడ్డ జన్మించాక మెల్లిగా అంబులెన్స్ కదిలిస్తూ లైట్లు ఆన్ ఆఫ్ చేస్తూ ముందుకెళ్లడంతో సింహాలు దారిచ్చాయి.