
మహిళను లాక్కెళ్లి చంపేసిన మొసలి
పశ్చిమబెంగాల్లోని సుందర్బన్ అడవుల్లో దారుణం జరిగింది. ఛోటో మొల్లాఖలీ ప్రాంతంలో రొయ్య పిల్లలను ఏరుకుంటున్న 40 ఏళ్ల మహిళను ఓ మొసలి నీళ్లలోకి లాక్కెళ్లిపోయి చంపేసింది. రంభా మొండల్, ఆమె భర్త శ్యామపాద కలిసి గోసబా నది పాయలోని ఫెర్రీ ఘాట్లో టైగర్ ప్రాన్ రొయ్యపిల్లలను ఏరుకోడానికి వెళ్లారు.
అప్పుడే మొసలి ఆమెను లాక్కుని నీళ్లలోకి వెళ్లిపోయింది. ఆమె గట్టిగా అరవడంతో భర్త శ్యామపాద, మరికొందరు స్థానిక మత్స్యకారులు కలిసి నాలుగు పడవల్లో ఆమెను కాపాడేందుకు వెళ్లారు. ఆ పడవలు మొసలిని చుట్టుముట్టినా, మహిళను మాత్రం కాపాడలేకపోయాయి. కొన్ని గంటల తర్వాత మహిళ మృతదేహం రెండు కాళ్లు, కుడి చేయి లేకుండా కొంత దూరంలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు పోలీసులు తెలిపారు.