న్యూఢిల్లీ: విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగుచూస్తుండటం తెలిసిందే. ఇండిగో సంస్థ సిబ్బంది అయితే ఓ ప్రయాణికుడిని రన్‌వేపైనే కిందపడేసి కొట్టారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఓ వివాదాస్పద ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ప్రయాణికురాలు, ఎయిరిండియా విమానయాన సంస్థ అధికారిణి ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు.
ఎయిరిండియాకు చెందిన ఏఐ–109 నంబర్ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఓ మహిళ టికెట్ బుక్ చేసుకున్నారు. చెక్–ఇన్ కౌంటర్ వద్దకు నిర్దేశిత సమయం కన్నా 35 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో ప్రయాణికురాలిని విమానమెక్కేందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో గొడవ మొదలైంది. ఎయిరిండియా నిబంధనల ప్రకారం దేశీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి కనీసం గంటంబావు ముందే చెక్–ఇన్ కౌంటర్ వద్దకు చేరుకోవాలి. కానీ సదరు ప్రయాణికురాలు కేవలం 40 నిమిషాలు ముందుగా వచ్చారు. దీంతో కౌంటర్‌లోని సిబ్బంది ఆమెను విమానమెక్కేందుకు అనుమతించకపోవడంతో ప్రయాణికురాలు వారితో వాదనకు దిగారు. దీంతో ఎయిరిండియా డ్యూటీ మేనేజర్‌గా ఉన్న అధికారిణి వద్దకు ప్రయాణికురాలిని సిబ్బంది పంపారు. అక్కడ వారిద్దరి మధ్య వాదనలు తీవ్రస్థాయికి చేరాయి. ఓ దశలో సంయమనం కోల్పోయిన ప్రయాణికురాలు అధికారిణిపై చేయిచేసుకున్నారు. వెంటనే అధికారిణి కూడా ప్రయణికురాలి చెంప చెల్లుమనిపించారు. తర్వాత వారిద్దరూ పరస్పరం క్షమాపణలు చెప్పుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment