రైలులో లైంగికదాడి చేసి కిందికి తోసి..
లక్నో: ఉత్తరప్రదేశ్లో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై రాత్రి ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమెను అదే రైలులోంచి ఖాజాకుర్ద్ అనే గ్రామంవద్ద కిందికి తోసేశారు. దీంతో ఆమె కాలు విరిగిపోయింది. నొప్పి బాధతో అరుస్తున్న ఆ మహిళను అక్కడి గ్రామస్తులు గుర్తించారు. ఆ సమయంలో ఆమె వివస్త్రగా పడి ఉంది. దీంతో ఆమెపై లైంగిక దాడి జరిగిందనే నిర్ణయానికి వచ్చారు.
బాధితురాలిని ప్రశ్నించగా తాను షాగంజ్ ప్రాంతానికి చెందిన మహిళనని, ఇంటికి వెళుతున్న తనపై ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించి రైలులో నుంచి తోసేశారని చెప్పింది. దీంతో ఆమెను తొలుత జిల్లా ఆస్పత్రికి అనంతరం వారణాసిలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందిస్తూ నిందితులను పట్టుకుంటామని, ఎలాంటి వారైనా వదిలిపెట్టబోమని చెప్పారు.