అత్యాచారాన్ని అడ్డుకుందని.. తలలో కాల్చేశారు!
మేఘాలయలో దారుణం జరిగింది. అత్యాచార ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఓ మహిళ తలపై తుపాకి పెట్టి జీఎన్ఎల్ఏ ఉగ్రవాదులు కాల్చిపారేశారు. దాంతో ఆమె తల ఛిద్రమైపోయి.. అక్కడికక్కడే మరణించింది. ఈ దుర్ఘటన మేఘాలయలోని దక్షిణ గారో హిల్స్ జిల్లాలో గల రాజా రోంగట్ ప్రాంతంలో జరిగింది.
ఆ మహిళ ఇంట్లో తన భర్త, పిల్లలతో ఉండగా నలుగురైదుగురు సాయుధ జీఎన్ఎల్ఏ ఉగ్రవాదులు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ప్రవపేశించారు. భర్తను, ఐదుగురు పిల్లలను లోపల ఓ గదిలో పెట్టి తాళం వేసి, మహిళను బయటకు లాక్కొచ్చారు. ముందుగా ఆమెపై దాడిచేసి, వేధించారు. ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయగా, పాయింట్ బ్లాంక్ రేంజిలో ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిళ్లతో కాల్చేశారు. దాంతో ఆమె తల రెండు ముక్కలైపోయిందని ఐజీ (ఆపరేషన్స్) జీహెచ్పీ రాజు తెలిపారు. ఈ సంఘటనను ఆ ప్రాంత ఎంపీ పీఏ సంగ్మా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, గతంలో ఎప్పుడూ ఇలా లేదని ఆయన అన్నారు. పరిస్థితులను చక్కదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.