ఏకంగా టూత్‌ బ్రష్‌ మింగేసింది...అయితే | Woman Swallowed Toothbrush Last Month, Doctors Removed It Without Surgery | Sakshi
Sakshi News home page

ఏకంగా టూత్‌ బ్రష్‌ మింగేసింది...అయితే

Published Fri, Feb 15 2019 2:13 PM | Last Updated on Fri, Feb 15 2019 2:16 PM

Woman Swallowed Toothbrush Last Month, Doctors Removed It Without Surgery - Sakshi

షిల్లాంగ్‌ : సాధారణంగా చిన్నపిల్లలు నాణేలు, చిన్న చిన్నమూతలు,  ఒక్కోసారి పిన్నీసులు లాంటి మింగేయడం చూశాం. అయితే ఒక పెద్దావిడ (50) ఏకంగా టూత్‌ బ్రష్‌ను మింగేసింది. ఇదే వింతగా వుంటే.. వైద్యులు ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా చాకచక్యంగా  బ్రష్‌ను బయటకు తీయడం విశేషంగా నిలిచింది.  షిల్లాంగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

లోయర్‌ మాప్రెమ్‌కు చెందిన మహిళ ఇటీవల పళ్లు తోముకుంటున్న సమయంలో ఒక్కసారిగా టూత్‌బ్రష్‌ మింగేసింది. అది నేరుగా ఆమె కడుపులోకి వెళ్లిపోయింది. అయినా ఆమెకు ఎలాంటి అరోగ్య సమస్యలు ఎదురు కాలేదు. కానీ అయితే వైద్యుడిని సంప్రదించాలని కూతురు బలవంతపెట్టడంతో..ఎట్టకేలకు మహిళ ఆసుపత్రికి వెళ్లక తప్పలేదు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులకు టూత్‌బ్రష్‌ ఒక‍్క పట్టాన కనబడలేదు. చివరికి ఎండోస్కోపీ ద్వారా బ్రష్‌ను కొనుగొన్న డాక్టర్లు తిరిగి నోటి ద్వారానే మింగేసిన బ్రష్‌కు బయటికు తీశారు.

దీనిపై వైద్యుడు ఇసాక్‌ సయీమ్‌ మీడియాతో మాట్లాడుతూ...మొదట ఎక్స్‌రేలో ఆమె కడుపులో టూత్‌బ్రష్‌  కనపడలేదని, దీంతో తాము ఎండోస్కోపీ నిర్వహించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు. టూత్‌బ్రష్‌ ఉందని తెలుసుకుని మొదట తామంతా ఆశ్చర్యపోయామనీ షిల్లాంగ్‌లో ఇటువంటి చికిత్స అందించడం మొదటిసారని పేర్కొ‍న్నారు. చికిత్స అనంతరం గంటన్నరకే ఆమెను డిశ్చార్జ్‌ చేశామన్నారు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారనీ, దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. అయితే బ్రష్‌ను తీసి ఉండకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు తలెత్తేవని చెప్పారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement