పట్టపగలు బిజీ మార్కెట్‌లో మహిళపై దారుణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అది కూడా ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పట్టణం అయిన మెయిన్‌పురిలో. అడ్రస్ అడిగిన మహిళను ఇద్దరు యువకులు అసభ్యంగా తాకడమే కాకుండా నిలదీసిన ఆమెను విచక్షణా రహితంగా కొట్టారు. ఆమె భర్త ఇద్దరు పిల్లల ముందే వారు పట్టపగలు నడి రోడ్డుపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు వీడియోలు తీసుకుంటూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరూ దాడి చేసే వారిని ఆపేందుకు ముందుకు రాలేదు. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా తలెత్తిన ఈ సంఘటన మరోసారి ఎస్పీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని విపక్షాలు దుమ్మెత్తిపోసేందుకు ఆసరాగా నిలిచింది.
పోలీసుల వివరాల ప్రకారం మెయిన్ పురిలోని రద్దీగా ఉండే మార్కెట్‌లో ఓ మహిళ తన భర్త పిల్లలతో కలిసి వెళుతోంది. అక్కడే ఉన్న ఇద్దరినీ కాస్తంత అడ్రస్ చెప్పాలని అడిగింది. అయితే, ఆ ఇద్దరు అడ్రస్ చెప్పడానికి బదులు చెడుగా ప్రవర్తించారు. దుర్భాషలాడి ఆమె చేయిపట్టుకొని లాగేందుకు ప్రయత్నించడంతో ఆమె లాగి పెట్టి కొట్టింది.
దీంతో అక్కడే ఉన్న ఓ పెద్ద కర్రను తీసుకొని ఆమెపై విచక్షణ రహితంగా తలపై కొట్టారు. రక్తం కారుతున్నప్పటికీ దాడిని ఆపకుండా వరుస దెబ్బలు కొట్టారు. అడ్డొచ్చిన ఆమె భర్తపై కూడా దాడి చేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడికి పోలీసులు రాగా.. నిందితులను అరెస్టు చేసి శిక్షించకుంటే తనను తాను కాల్చుకొని చచ్చిపోతానంటూ ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒకరిని అరెస్టు చేశారు. మిగితా వారికోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.