చెన్నై : డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకున్నా జీన్స్ వేసుకున్న ఓ యువతిని డ్రైవింగ్ టెస్ట్‌కు నిరాకరించిన ఘటన వెలుగుచూసింది. సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేసే ఓ మహిళ జీన్స్, స్లీవ్‌లెస్ టాప్ ధరించి రావడంతో కేకే నగర్‌లోని ఆర్టీవో కార్యాలయ అధికారి ఒకరు ఆమెను డ్రైవింగ్ టెస్ట్‌కు నిరాకరించారు. ఇంటికి వెళ్లి సరైన డ్రైస్‌లో రావాలని తిప్పిపంపినట్టు తెలిసింది. షార్ట్స్‌తో వచ్చిన మరో మహిళను కూడా కుదురైన డ్రెస్ ధరించి రావాలని ఆ అధికారి కోరారు. షార్ట్స్, లుంగీలు, బెర్ముడాస్‌తో వచ్చిన పురుషులను కూడా పొందికైన డ్రెస్ ధరించి రావాలని కోరామని, అలాగే మహిళలకూ సూచించామని ఆర్టీఏ వర్గాలు పేర్కొన్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే కార్యాలయం ప్రభుత్వ కార్యాలయమని ఇక్కడకు వచ్చేవారిని సరైన దుస్తులు ధరించాలని కోరడంలో తప్పేముందని ఆర్టీవో అధికారి ప్రశ్నించారు. ఇది మోరల్ పోలీసింగ్ కిందకు రాదని ఆ అధికారి చెప్పుకొచ్చారు. ఎంతో మంది ఇక్కడకు రోజూ వస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా పద్ధతిగా డ్రెస్ చేసుకుని రావాలని మాత్రమే తాము సూచించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment