దప్పికతోనే మహిళ పోలీసుల విధులు!
న్యూఢిల్లీ: మహిళా సాధికారిత సాధనలో భాగంగా పోలీసుశాఖలోనూ పెద్ద ఎత్తున మహిళలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో కనీస మౌలిక సౌకర్యాలు లేక మహిళా పోలీసులు అనుభవిస్తున్న కష్టాలను తాజాగా ఓ సర్వే వెలుగులోకి తెచ్చింది. విధులు నిర్వహించే ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఒకటికి వెళ్లకుండా ఉండేందుకు కనీసం నీళ్లు కూడా తాగకుండా మహిళా పోలీసులు కర్తవ్యపాలన చేస్తున్నారు. దీనికితోడు పురుషుల శరీర దారుఢ్య కొలతలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రక్షణ జాకెట్లు రూపొందిస్తుండటంతో అవి తాము ధరించినప్పుడు చాలా బిగుతూగా ఉండి.. ఊపిరి కూడా అందడం లేదని, చాలాబరువుగా కూడా ఉంటున్నాయని మహిళా పోలీసులు ఈ సర్వేలో వెల్లడించారు.
గత ఏడాది జరిగిన పోలీసుశాఖలోని మహిళల 7వ జాతీయ సదస్సు సందర్బంగా ఈ సర్వే వివరాలు, సిఫారసులను అందజేశారు. పోలీసు రీసెర్చ్, అభివృద్ధి బ్యూరో, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే వివరాలు తాజాగా వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాల గురించి చర్చించి.. వాటి పరిష్కారం కోసం సలహాలతో కూడిన ఈ సర్వే వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర బలగాల్లో 33శాతం పోస్టులను, సరిహద్దు భద్రతా దళాల్లో 15 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీసుశాఖలోని మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.