రేఖా శర్మ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందినా అవి కేవలం రాజకీయ నాయకుల బిడ్డలకు, భార్యలకు మాత్రమే దక్కే అవకాశం ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మహిళా కమిషన్ శుక్రవారం నిర్వహించిన ‘భారతదేశంలో మహిళల రాజకీయ పాత్ర, ప్రాతినిధ్యం’ అనే అంశంపై ఆమె మాట్లాడుతూ... ‘ దేశంలో మహిళలు స్వశక్తితో ఎదగాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తే.. అది కేవలం రాజకీయ నాయకుల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. మీ లాంటి, మా లాంటి సామాన్య మహిళకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాదు.
50 శాతం మహిళా జనాభా ఉన్నప్పుడు అంతే శాతం రాజకీయాల్లో కూడా ఉండాలి. అది మహిళల హక్కు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలో ఎన్నికైన మహిళలకు రాజకీయ హక్కును వారి భర్తలే హరిస్తున్నారు. పేరుకే మహిళా ప్రజా ప్రతినిధి. అధికారాలన్నీ పురుషులే చలాయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో కూడా వారికి తెలియదు. వారు కేవలం సంతకాలకే పరిమితం అవుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు.
చదువుకున్న యువతులు రాజకీయంగా ఎదగడనికి ప్రయత్నించాలని సూచించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్‌లో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజరేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది ప్రస్తుతం లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment