మాట్లాడుతున్న జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రత కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ వ్యాఖ్యానించారు. జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సమావేశాలు సోమవారం ముగిశాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన సదస్సులో 16 రాష్ట్రాలకు చెందిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్లు, సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేఖా శర్మ మాట్లాడుతూ.. ఎన్నారై వివాహ మోసాలకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ సంబంధాల విషయంలో పూర్తి వివరాలు ముందుగానే తెలుసుకునేలా యువతులను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఏపీలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు, రక్షణకు తీసుకుంటున్న చర్యలు, మహిళా సాధికారితను వివరించారు.
మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మ ఒడి, చేయూత, చేదోడు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ తదితర సంక్షేమ పథకాలతో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటోందని తెలియజేశారు. ‘దిశ’ యాప్, దిశ పోలీస్‌స్టేషన్ల ద్వారా మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం భరోసా ఇస్తోందని వివరించారు. కాగా, ఏపీ ప్రభుత్వ మహిళా సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకునేందుకు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు వాసిరెడ్డి పద్మ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment