ప్రధాని మోదీపై మాల్యా విసుర్లు
న్యూఢిల్లీ: టెక్నాలజీతో అవినీతిని నిర్మూలిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థల్లో టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు.
‘2017లో మోదీ సర్కారు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా, కరెక్టుగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాను. రైతులు కూడా టెక్నాలజీ వాడాలని మన ప్రియతమ ప్రధానమంత్రి చెబుతున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ సంస్థలు టెక్నాలజీని వినియోగించడానికి నిరాకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అవినీతిని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నానని మోదీ చెబుతున్నారు. ఆయన నియంత్రణలో ఉన్న నేర దర్యాప్తు సంస్థలు పక్షపాత రహితంగా, న్యాయబద్దంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంద’ని మాల్యా ట్విటర్‌లో పేర్కొన్నారు. బ్యాంకులకు రూ. 9400 కోట్ల రుణాల ఎగవేత కేసులో మ్యాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.