'మీతో అనుబంధం మాకెంతో గౌరవం'
ఐక్యరాజ్యసమితి (ఐరాస) వల్లే ప్రపంచం మనుగడ సాధించగలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస ప్రధాన విభాగమైన యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రారంభం నుంచి నేటివరకు అనుబంధాన్ని కొనసాగించడం భారత్ గౌరవ ప్రదంగా భావిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం ప్యారిస్లోని వరల్డ్ హెరిటేజ్ సెంటర్లో జరిగిన యునెస్కొ 38వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. విద్య, శాస్రవిజ్ఞానం, సాంస్కృతిక అంశాల్లో యునెస్కో తోడ్పాటు మరువలేనిదన్నారు.
ప్రతి బాలిక బడికి వెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్న మోదీ.. బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం ద్వారా భారత్లో బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నామని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చుతున్నామని సమావేశానికి హాజరైన ప్రతినిధులకు వివరించారు. సానుకూల పరిస్థితుల్లోకంటే ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన అభివృద్ధినే పరిగణనలోకి తీసుకుంటామని, తద్వారా నమ్మకం రెట్టింపవుతుందని అప్పుడు మాత్రమే ప్రజల ముఖంలో సంతోషం చూడగలమని వ్యాఖ్యానించారు.
తొమ్మిది రోజులపాటు మూడు దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ గురువారం రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్కు చేరుకున్నారు. అక్కడి నుంచి జర్మనీ, కెనడా సందర్శనకు వెళ్లనున్నారు. పౌర అణు ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో ఆ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.