
డెహ్రాడూన్ నుంచి డబ్లిన్ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు ఎటు చూసినా యోగా సందడే. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం అన్ని దేశాలు యోగ సాధనలో మునిగితేలాయి. ఏడాదికొక్కసారి వంటిని విల్లులా వంచి ఫొటోలకు పోజులిచ్చేశాక మళ్లీ యోగా డే వరకు కొందరు ఆ ఊసు కూడా మర్చిపోవచ్చు. కానీ కొన్ని స్టార్టప్ కంపెనీలు మాత్రం యోగా శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంచడమే కాదు ఆర్థిక ఆలంబన కూడా అంటున్నాయి. యోగా మార్కెట్‌ను పెంచడానికి కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన దగ్గర్నుంచి దానిపై ఎన్ని వివాదాలు నెలకొన్నాయో, వ్యాపారం కూడా అంతే పెరిగింది. యోగా స్టూడియోల దగ్గర్నుంచి యోగాసనాలు చెయ్యడానికి వాడే చాపలు, యోగా డ్రింక్స్, యోగా చేసే సమయంలో వాడే దుస్తులు వంటి వాటి చుట్టూ గత మూడేళ్లుగా వ్యాపారం బాగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా యోగాతో ఇంచుమించుగా 5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటే, భారత్‌లో 85 వేల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి.
గత అయిదేళ్లలోనే యోగా సెంటర్లు, యోగాకి సంబంధించిన ఉత్పత్తుల చుట్టూ జరిగే వ్యాపారం 87 శాతం పెరిగింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా యోగ సాధన చేస్తున్నారని అంచనాలు ఉన్నాయి. అదే అమెరికాలో యోగాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ దేశంలో 3 కోట్ల మందికి పైగా యోగా సాధన చేస్తున్నారు. అమెరికాలో వ్యాపార పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో యోగాది నాలుగో స్థానం. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, యూరప్, ఐర్లండ్‌లో యోగాకి క్రేజ్ ఎక్కువ. భారత్‌లో మెట్రోనగరాల్లో యోగాకి ఇప్పుడు బాగా క్రేజ్ పెరుగుతోంది. శిల్పాశెట్టి, కరీనాకపూర్ వంటి సెలబ్రిటీల యోగా వీడియోలు సామాన్య జనాల్లోనూ యోగా పట్ల ఆసక్తిని పెంచాయి. యోగా శిక్షకులకి వచ్చే ఏడాదిలో 30 నుంచి 35 శాతం డిమాండ్ పెరుగుతుందని అంచనా. రాందేవ్ బాబా తనకున్న యోగా ఇమేజ్‌తోనే పతంజలి వ్యాపార సామ్రాజ్యాన్ని 10 వేల కోట్లకి విస్తరించారు.
- ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నవారి సంఖ్య – 30 కోట్లకి పై మాటే
- భారత్‌లో యోగా శిక్షకులు – 2 లక్షలు మంది
- ఇంకా కావాల్సిన శిక్షకులు – 5 లక్షలు
- చైనాలో యోగా పాఠాలు చెబుతున్న ఇండియన్లు – 3 వేలు
- భారతీయులు ప్రతినెల యోగాపై ఖర్చు చేస్తున్నది – రూ. 5 వేల నుంచి 25 వేలు
- అంతర్జాతీయ యోగా డే కోసం 2015,16లో భారత్ ఖర్చు చేసింది – 35.50 కోట్లు
- యోగా చుట్టూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపారం – 8 వేల కోట్ల డాలర్లు (5,44,000 కోట్లు)
- కేవలం అమెరికాలో యోగా వ్యాపారం – 3 వేల కోట్ల డాలర్లు (2,04,00 కోట్లు)
- భారత్‌లో జరుగుతున్న వ్యాపారం – రూ.85 వేల కోట్లు
కొత్త వ్యాపార వ్యూహాలు
యోగా చుట్టూ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మన దేశంలో కొన్ని స్టార్టప్ కంపెనీలు కొత్త వ్యూహాల్ని రచిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులు చేపట్టి యోగా సాధకుల్ని ఆకట్టుకుంటున్నాయి. యోగ సాధన కోసం ప్రత్యేకంగా వాడే మ్యాట్స్‌కి ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. జ్యూట్, నేచరల్ రబ్బరు కలగలిపిన మిశ్రమంతో తయారు చేసే ఈ మ్యాట్స్ చాలా తేలికగా ఉంటాయి. మడతపెట్టి ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు. చెన్నైలో తయారవుతున్న ఈ మ్యాట్స్‌కి బాగా క్రేజ్ పెరిగింది. బెంగుళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ యోగా జల్‌ను తయారు చేస్తోంది. ఇందులో కృత్రిమ రంగులేవీ వాడరు. సహజసిద్ధమైన మూలికలను వినియోగించి చేస్తారు. ఇందులో 8 నుంచి 10శాతం సల్ఫర్ ఫ్రీ షుగర్ ఉంటుంది. ఈ యోగా జల్ తాగితే ఉత్తేజం, ఉల్లాసం వస్తాయని ఆ కంపెనీ చెబుతోంది. బెంగుళూరుకు చెందిన మరో స్టార్టప్ కంపెనీ యోగా బార్స్‌ని తయారు చేస్తోంది. మామూలు చాక్లెట్ బార్స్ బదులుగా వీటిని తీసుకుంటే యోగా చేస్తే ఎంత శక్తి వస్తుందో అంత వస్తుందన్న ప్రకటనలతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నారు.
రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన వస్తువులు, విటమిన్లు వినియోగించి తయారు చేసిన వీటిని 25–35 వయసు మధ్యనున్న వారు, ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఫరెవర్ యోగ పేరుతో వస్తున్న బ్రాండెడ్ దుస్తులకు ఈ మధ్యకాలంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నాటి యూత్ ఫ్యాషన్‌లను దృష్టిలో ఉంచుకొని చాలా సౌకర్యంగా ఉండే దుస్తులను తయారు చేస్తున్నారు. ఇక బెంగుళూరుకి చెందిన అక్షర పవర్ యోగా సెంటర్ ప్రపంచ గుర్తింపుని సాధించింది. యోగా టీచర్లకి కూడా ఈ సెంటర్‌లో శిక్షణనిస్తూ అత్యధిక లాభాలు ఆర్జిస్తోంది. అక్షర పవర్ యోగా సెంటర్ విజయాల స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా ఎన్నో యోగా సెంటర్లు పుట్టుకొచ్చాయి.