ఒక్క దెబ్బతో ఏడాదికి 15 సెలవులు రద్దు!
తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి ఎన్ని సెలవులు ఉంటాయి? పండుగలు, ప్రముఖుల పుట్టినరోజులు అన్నీ కలిపినా మహా అయితే 15-20కి మించవు. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఇన్నాళ్ల బట్టి ఏకంగా 42 పబ్లిక్ హాలిడేలు ఉన్నాయి. వాటి మీద ఒక్కసారిగా కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేటు వేశారు. ఒకేసారి మొత్తం 15 సెలవులు రద్దుచేశారు. ఈ మేరకు యోగి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇస్తున్న సెలవుల్లో చాలావరకు రద్దు చేస్తూ నిర్ణయించారు. ఈ రోజులన్నీ ఇన్ని సెలవులు ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు ఇక పనిచేసేది ఎప్పుడని సీఎం యోగి మండిపడ్డారు. రోజుకు 18-20 గంటలు పనిచేయగలిగితేనే తనతో ఉండాలని, లేకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకోవచ్చని ముందే చెప్పిన యోగి.. ఇప్పుడు సెలవులను కూడా తగ్గించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలోనే సూచనప్రాయంగా ఆయనీ విషయం వెల్లడించారు. ప్రముఖుల జయంతులప్పుడు స్కూళ్లకు సెలవులు ఇవ్వొద్దని, ఆరోజు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వాళ్ల గొప్పదనం గురించి రెండు గంటల పాటు పిల్లలకు చెప్పాలని అన్నారు.
అధికారులు తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని, సమయానికి తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ప్రవేశపెట్టారు. పబ్లిక్ హాలిడేలలో 15 రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్ మంత్రి శ్రీకాంత్ శర్మ ప్రకటించారు. ఆయా రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు కూడా పనిచేస్తాయన్నారు. విద్యార్థులకు వాళ్ల గురించి వివిధ కార్యక్రమాల ద్వారా వివరిస్తారన్నారు. ఇలా ఇప్పటికే ఉన్న సెలవులను రద్దుచేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 3 పబ్లిక్ హాలిడేలు ఉంటే సరిపోతుందని, లేదా కనీసం వాటిని 17కు తగ్గించాలని వేతన కమిషన్లు పలు సందర్భాల్లో చెప్పాయి. కానీ, ఉద్యోగ సంఘాల ఒత్తిళ్ల కారణంగా ఏ ప్రభుత్వమూ అంతటి సాహసం చేయలేకపోయింది.