తొగాడియా- యోగి ఆధిత్యానాథ్
లక్నో : 2019 లోక్‌సభ ఎన్నికల ముందు అయోధ్య రామమందిర నిర్మాణం మరోసారి తెరపైకి రానుంది. దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలోపు రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కూడా మంగళవారం అయోధ్యను సందర్శించనున్నారు. వీహెచ్‌పీ నుంచి తొగాడియాను బహిష్కరించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని తొగాడియా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కావాలనే రామమందిర నిర్మాణాన్ని ఆలస్యం చేస్తోందని పలు మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు.
ఇదిలావుండగా యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వాసిమ్ రిజ్వి ఆదివారం నాడే ఆయోధ్యను సందర్శించి రామమందిర నిర్మాణం కొరకు పదివేల రూపాయల విరాళం అందజేశారు. దేశంలో కొంతమంది రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని, వారు దేశద్రోహులతో సమానమని విమర్శించారు. అయోధ్యలో రామమందిరం కచ్చితంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రతిపక్షాలన్ని జట్టు కడుతున్న నేపథ్యంలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎలాంటి వ్యూహన్ని అమలు చేస్తోందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment