ఆర్నాబ్‌కు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామికి ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక లైవ్ టెలివిజన్‌లో ఓ వ్యక్తి పేరును ఎలా ప్రస్తావిస్తారని, అతడిని తప్పుచేసిన వ్యక్తిగా ఎలా చెప్తారని ప్రశ్నించింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. సునంద పుష్కర్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అసిస్టెంట్ నారాయణ్‌తో రిపబ్లిక్ టీవీ ద్వారా లైవ్‌లో మాట్లాడిన గోస్వామి నేరుగా శశిథరూర్ పేరును ప్రస్తావించడంతోపాటు, ఆయనే తప్పుచేశారని అర్ధం వచ్చేట్లుగా మాట్లాడారు.
దీనికి సంబంధించి థరూర్ కోర్టులో ఆర్నాబ్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసుపైనే తాజాగా హైకోర్టు స్పందిస్తూ ఆర్నాబ్‌కు అక్షింతలు వేసింది. గోస్వామినే ఒక లైవ్ టీవీ ద్వారా ఒక వ్యక్తిపై అంతిమ నిర్ణయానికి రాకూడదని, దోషిగా ఓ వ్యక్తిని ప్రకటించకూడదని, శశిథరూర్ పేరును ప్రస్తావించరాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఆర్నాబ్ తరుపు న్యాయవాది సందీప్ సేథి వివరణ ఇస్తూ ఇకపై ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. తదుపరి వాదనలు ఆగస్టు 16కు కోర్టు వాయిదా వేసింది.