
'నా ఆనందం కోసం ఆలోచించావా?'
న్యూఢిల్లీ: 'రాహుల్‌తో నా జీవితం ఆనందంగా, భద్రంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా నన్ను ప్రేమించేవారికి అంతకన్నా ఇంకేం కావాలి?'.. షీనా బోరా తన తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు రాసిన లేఖ ఇది. వరుసకు సవతి సోదరుడయ్యే రాహుల్‌తో షీనా బోరా డేటింగ్ చేస్తుండటంతో ఇంద్రాణి కుటుంబంలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఆ సమయంలో తన సొంత నిర్ణయాలు తాను తీసుకునేందుకు అనుమతించాలంటూ షీనా బోరా తల్లి ఇంద్రాణికి ఈమెయిల్ లేఖ రాసిందని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది.
2012లో షీనాను ఇంద్రాణి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ హత్య ఘటనకు ముందే తల్లి ఇంద్రాణికి షీనా రాసిన లేఖలోని వివరాలను సీబీఐ వెల్లడించింది. ' నీ జీవితంలో నీకు ఏదైతే ఆనందం ఇస్తుందో అదే నువ్వు చేశావు. నాకు కూడా అంతే వర్తిస్తుంది. దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? నాలోను కొంతవరకు నీ లక్షణాలే ఉన్నాయి. నా జీవితాన్ని నేను వెతుక్కుంటాను. నువ్వు దాని గురించి కలతపడకు' అని షీనా తల్లిని ఉద్దేశించి లేఖలో పేర్కొంది.
షీనా బోరా రాహుల్‌తో ప్రేమలో మునిగి ఉండటంతో వారిద్దరూ విడిపోవాల్సిందేనని ఇంద్రాణి ఒత్తిడి తెచ్చి ఉంటుందని, ఈ నేపథ్యంలోనే షీనా ఈ లేఖ రాసిందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు తన చిన్న కూతురు వైదేహీతో షీనా బోరా సన్నిహితంగా ఉండటం, తన భర్త, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీయాతో దగ్గరవుతుండటం కూడా ఇంద్రాణి సహించలేకపోయిందని, తన ఆస్తులను ఎక్కడ షీనా బోరా సొంతం చేసుకుంటుందోనని, వైదేహీని తనకు దూరం చేస్తుందేమోననే భావనతోనే ఇంద్రాణి ఆమె హత్యకు ఒడిగట్టి ఉండవచ్చునని దర్యాప్తు వర్గాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా సవతి తండ్రి పీటర్‌కు కూడా షీనా లేఖ రాసిందని, అందులో 'నా సమస్య ఇంద్రాణితోనే. అది నా వ్యక్తిగత విషయం. మీరు ఇంద్రాణికి ఈ విషయాన్ని చెప్పి ఒప్పించండి. అంతేకానీ నన్ను-రాహుల్‌ను దూషించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు' అని షీనా పేర్కొందని సీబీఐ తెలిపింది.