
నిత్యావసరాల ధరల్ని నియంత్రించండి
లోక్‌సభ చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విధానాన్ని అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. గురువారం లోక్‌సభలో ధరల పెరుగుదలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘ద్రవ్యోల్బణ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ చెబుతున్నా దేశంలో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌లో 5.47 శాతం పెరిగిన ధరలు, మేలో 5.76 శాతానికి పెరిగిపోయాయి.
వడ్డీరేట్ల విధానంతోనే ధరలు నియంత్రించవచ్చని ఆర్బీఐ నమ్మడం బాధాకరం. పంట సాగు లేకపోవడం, సబ్సిడీల కొరత, బ్లాక్ మార్కెట్‌కు నిత్యావసరాలు తరలించడం వంటి అనేక కారణాల వల్ల ధరలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి నిర్ణయాత్మాక చర్యలు చేపట్టాలి’ అని మేకపాటి కోరారు.