సిరికొండలో నిరుపయోగంగా మారిన మన టీవీ
సిరికొండ(నిజామాబాద్ రూరల్): ‘రాజుల పైస రాళ్ల పాలు’ అన్న చందంగా మారింది. ప్రభుత్వం మన టీవీలకు వెచ్చించిన నిధుల వ్యవహారం. ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకొనేలా ప్రోత్సహించడానికి సరఫరా చేసిన టీవీలు చిన్నపాటి మరమ్మతులకు నోచుకోలేక మూలనపడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 మండల పరిషత్ కార్యాలయాలకు ఈ టీవీలను ప్రభుత్వం లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం సరఫరా చేసింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నా ఇవి మూలన పడిపోవడంతో ఈ కార్యక్రమాలను అధికారులు వీక్షించలేకపోతున్నారు. ప్రతి మండలానికి ఒకటి చొప్పున అందజేసిన టీవీలు నిరుపయోగంగా మారాయి.
వెంటాడుతున్న సాంకేతిక లోపాలు..
ప్రభుత్వ కార్యక్రమాలు ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలను చైతన్యపర్చాలనే ఉద్దేశంతో 2014 జూన్‌లో జిల్లావ్యాప్తంగా 36 మండల పరిషత్ కార్యాలయాలకు టీవీలను మంజూరు చేశారు. అపార్ట్ అనే ప్రైవేటు సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని టీవీలను సరఫరా చేసినది. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరంభశూరత్వంలా మారినది. తొలుత గ్రామీణులకు కొద్దిగా ఉపయోగపడినా ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి మూలనపడ్డాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా అన్ని మండల కార్యాలయాల్లో ఇవి మూలనపడ్డాయి. చిన్న సాంకేతిక లోపాలు, మరమ్మతుల కారణంగా ఇవి పని చేయడం లేదు.
సరఫరా చేసి వదిలేశారు..
మండల పరిషత్ కార్యాలయాలలో టీవీలను ఏర్పాటు చేసిన తర్వాత చిన్నచిన్న మరమ్మతులు వచ్చినా అవి సరఫరా చేసిన అపార్ట్ సంస్థ చూసుకోవాలి. టీవీలను అమర్చిన తర్వాత ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తిచూడటం లేదు. టీవీల్లో బ్యాటరీలు మరిన్ని సాంకేతిక లోపాలతో పనిచేయడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. స్థానికంగా మరమ్మతులు చేసుకొనే వీలు లేకపోవడంతో సరఫరా చేసిన సంస్థ ప్రతినిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా మండలాల అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయోజనాలు బోలేడు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ప్రజలు తెలుసుకోవడం అర్హులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవడం ఇతర విషయాలు తెలుసుకోవడంలో భాగంగా ఈ టీవీలను అందించారు. ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ఇతర కార్యక్రమాలు కూడా ఇందులో ప్రసారం అవుతాయి. విద్య, ఐసీడీఎస్, ఉపాధి హమీ, ఆరోగ్యశాఖ వివిధ సంక్షేమ పథకాలు అయిన కల్యాణలక్ష్మి, విద్యా రుణాలు, ఆసరా పింఛన్లు అమలు తదితర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రతి రోజు ఏదో ఒక శాఖకు సంబంధించిన అభివృద్ధిపై కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టినప్పటికీ అవి మూలనపడటంతో లక్ష్యం నెరవేరడం లేదు.
ఉమ్మడి జిల్లాలో మంజూరు చేసిన మన టీవీలు - 36
ఒక్కొక్క మన టీవీ ఖర్చు రూ. 25 వేలు
మన టీవీలకు వెచ్చించిన మొత్తం వ్యయం రూ. 9 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment