MANA TV
-
అటకెక్కిన మన టీవీలు
సిరికొండ(నిజామాబాద్ రూరల్): ‘రాజుల పైస రాళ్ల పాలు’ అన్న చందంగా మారింది. ప్రభుత్వం మన టీవీలకు వెచ్చించిన నిధుల వ్యవహారం. ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకొనేలా ప్రోత్సహించడానికి సరఫరా చేసిన టీవీలు చిన్నపాటి మరమ్మతులకు నోచుకోలేక మూలనపడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 మండల పరిషత్ కార్యాలయాలకు ఈ టీవీలను ప్రభుత్వం లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం సరఫరా చేసింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నా ఇవి మూలన పడిపోవడంతో ఈ కార్యక్రమాలను అధికారులు వీక్షించలేకపోతున్నారు. ప్రతి మండలానికి ఒకటి చొప్పున అందజేసిన టీవీలు నిరుపయోగంగా మారాయి. వెంటాడుతున్న సాంకేతిక లోపాలు.. ప్రభుత్వ కార్యక్రమాలు ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలను చైతన్యపర్చాలనే ఉద్దేశంతో 2014 జూన్‌లో జిల్లావ్యాప్తంగా 36 మండల పరిషత్ కార్యాలయాలకు టీవీలను మంజూరు చేశారు. అపార్ట్ అనే ప్రైవేటు సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని టీవీలను సరఫరా చేసినది. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరంభశూరత్వంలా మారినది. తొలుత గ్రామీణులకు కొద్దిగా ఉపయోగపడినా ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి మూలనపడ్డాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా అన్ని మండల కార్యాలయాల్లో ఇవి మూలనపడ్డాయి. చిన్న సాంకేతిక లోపాలు, మరమ్మతుల కారణంగా ఇవి పని చేయడం లేదు. సరఫరా చేసి వదిలేశారు.. మండల పరిషత్ కార్యాలయాలలో టీవీలను ఏర్పాటు చేసిన తర్వాత చిన్నచిన్న మరమ్మతులు వచ్చినా అవి సరఫరా చేసిన అపార్ట్ సంస్థ చూసుకోవాలి. టీవీలను అమర్చిన తర్వాత ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తిచూడటం లేదు. టీవీల్లో బ్యాటరీలు మరిన్ని సాంకేతిక లోపాలతో పనిచేయడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. స్థానికంగా మరమ్మతులు చేసుకొనే వీలు లేకపోవడంతో సరఫరా చేసిన సంస్థ ప్రతినిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా మండలాల అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోజనాలు బోలేడు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ప్రజలు తెలుసుకోవడం అర్హులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవడం ఇతర విషయాలు తెలుసుకోవడంలో భాగంగా ఈ టీవీలను అందించారు. ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ఇతర కార్యక్రమాలు కూడా ఇందులో ప్రసారం అవుతాయి. విద్య, ఐసీడీఎస్, ఉపాధి హమీ, ఆరోగ్యశాఖ వివిధ సంక్షేమ పథకాలు అయిన కల్యాణలక్ష్మి, విద్యా రుణాలు, ఆసరా పింఛన్లు అమలు తదితర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రతి రోజు ఏదో ఒక శాఖకు సంబంధించిన అభివృద్ధిపై కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టినప్పటికీ అవి మూలనపడటంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఉమ్మడి జిల్లాలో మంజూరు చేసిన మన టీవీలు - 36 ఒక్కొక్క మన టీవీ ఖర్చు రూ. 25 వేలు మన టీవీలకు వెచ్చించిన మొత్తం వ్యయం రూ. 9 లక్షలు -
14 నుంచి టీ–శాట్ చానళ్లలో ‘ఇంగ్లిష్ ఫర్ ఆల్’
సాక్షి, హైదరాబాద్: వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టీ–శాట్ చానళ్లలో ప్రత్యేకంగా ఆంగ్లబోధన పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్లు టీ–శాట్ సీఈఓ ఆర్.శైలేశ్‌రెడ్డి వెల్లడించారు. రామకృష్ణ మఠం సౌజన్యం తో ‘ఇంగ్లిష్ ఫర్ ఆల్’కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి ప్రతి ఆదివారం నిపుణ, విద్య చానళ్లలో ప్రసారం చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు నిపుణ చానల్లో, సాయంత్రం 4గంటలకు విద్య చానల్లో 45 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీఆర్టీ ప్రసారాలు మరో 3 గంటలు.. టీ–శాట్ నెట్వర్క్ చానళ్లలో ప్రసారం చేస్తున్న టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) అవగాహన ప్రసారాలను ఈ నెల 12 నుంచి మరో 3 గంటలు అదనంగా ప్రసారం చేయనున్నట్లు శైలేశ్‌రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులున్న నేపథ్యంలో 5 రోజుల పాటు ప్రసారాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నిపుణ చానల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4గంటల వరకు, విద్య చానల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఈ అదనపు ప్రసారాలుంటాయని పేర్కొన్నారు. -
మనటీవీలో పాలీసెట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: పాలీసెట్ విద్యార్థుల కోసం మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు శిక్షణ తరగతులను ప్రసారం చేయనున్నామని మన టీవీ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 23 రోజుల పాటు పాలీసెట్ శిక్షణ తరగతుల ప్రసారాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రసారాలు మన టీవీ–1, మన టీవీ–2 చానళ్లతో పాటు మన టీవీ ఫేస్బుక్, వాట్సాప్, ట్వీట్టర్ ఖాతాల్లో కూడా అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నేటి నుంచి టీఎస్ క్లాస్ ప్రసారాలు
ప్రారంభించనున్న మంత్రులు కడియం, కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘టీఎస్–క్లాస్’ కార్యక్రమాలు బుధవారం నుంచి మనటీవీలో ప్రసారం కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ ప్రసారాలను ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి 12.55 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలు విద్యార్థులకు వరమని మనటీవీ సీఈవో శైలేష్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 6 వేల ప్రభుత్వ పాఠశాలలకు ఈ ప్రసార కార్యక్రమాలు అందనున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతతో అందించే విద్యను పటిష్టపర్చాలనే లక్ష్యానికి ఇదో ముందడుగు అని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా డిజిటల్ విద్య అందనుందని తెలిపారు. -
మన టీవీ వీక్షకులు 10 లక్షల మంది
- గ్రూప్-2 ప్రత్యక్ష ప్రసారాలు మరో వారం పొడిగింపు - కేబుల్ ఆపరేటర్లకు ఆర్వోటీ సరఫరా హైదరాబాద్: మన టీవీ ద్వారా ప్రసారమవుతున్న గ్రూప్-2 శిక్షణ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోంది. గడిచిన 20 రోజుల్లో 10 వేల మంది సబ్స్క్రైబర్లు నమోదుకాగా, దాదాపు 10 లక్షల మంది వీక్షించారని మన టీవీ సీఈవో శైలేష్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున ముందుకొచ్చి కేబుల్ ద్వారా మన టీవీ ప్రసారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన మరో 13 జిల్లాలకు ప్రసారాలు విస్తరించాయని, మారుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాచలం వంటి జిల్లాలకు త్వరలోనే ప్రసారాలను విస్తరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో మన టీవీ ప్రసారాలు అందుకోలేని కేబుల్ ఆపరేటర్లకు ఆర్వోటీ (రిసీవ్ ఓన్లీ టర్మినల్) డిష్‌లను ఐటీ శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గ్రూప్-2 అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కొనసాగిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పెరుగుతున్న ఆదరణకు తగ్గట్లుగానే నాణ్యత పెంచడంతోపాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రసారాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. -
‘మన టీవీ’ ప్రసారాలకు ఎంఎస్‌వో ఆమోదం
⇒ పోటీ పరీక్షల కోసం తొలి చానల్.. ⇒ నేటి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ⇒ ప్రసారాల ప్రణాళిక వెల్లడించిన సీఈవో శైలేశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘మన టీవీ చానల్’ కార్యక్రమాలను కేబుల్ ద్వారా ప్రసారం చేసేందుకు రాష్ట్రంలోని ఎంఎస్‌వోలు అంగీకరించారు. కేబుల్ ప్రసారాలకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం హామీ ఇచ్చింది. శనివారం మన టీవీ కార్యాలయం ప్రాంగణంలో కేబుల్ ద్వారా మన టీవీ కార్యక్రమాల ప్రసారానికి సంబంధించి ఎంఎస్‌వోల సమావేశం జరిగింది. మన టీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎంఎస్‌వోలు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారిగా పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఘనత ‘మన టీవీ’కి దక్కుతుందని శైలేశ్‌రెడ్డి వెల్లడించారు. పేదలు, మారుమూల ప్రాంతాలకు చెందిన యువత, విద్యార్థులకు చేరడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకరించాల్సిందిగా కోరారు. మనటీవీ ద్వారా ఆదివారం నుంచి గ్రూప్-2 అభ్యర్థుల కోసం ఉదయం 10 నుంచి 10.50 వరకు రసాయన శాస్త్రం, 11 నుంచి 11.50 వరకు సమాజ నిర్మాణం, మధ్యాహ్నం 12 నుంచి 12.50 వరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఒంటి గంట నుంచి 1.50 వరకు రాజనీతి శాస్త్రం (పాలిటీ) అంశాలపై ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని వెల్లడించారు. మన టీవీకి ఎంఎస్‌వోల సహకారం మన టీవీ కార్యక్రమాలను కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రసారం చేసేందుకు ఎంఎస్‌వోలు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు సహకరిస్తామని ఎంఎస్‌వోల సంఘం ప్రతినిధి ఎం.సుభాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 60 మంది ఎంఎస్‌వోలు, 15 వేల మంది లోకల్ ఎంఎస్‌వోల ద్వారా సుమారు 90 లక్షల కుటుంబాలకు కేబుల్ ప్రసారాలు చేరవేస్తున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మన టీవీ కార్యక్రమాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని ఆర్వీఆర్ కేబుల్ ప్రతినిధి ఫణికృష్ణ సూచించారు. యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో తాము భాగస్వాములవుతామని హాత్వే ప్రతినిధి ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సహకరిస్తామని సిటీ కేబుల్ ఎండీ శివరామకృష్ణ చెప్పారు. -
80 లక్షల కుటుంబాలకు ‘మన టీవీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 80 లక్షల కుటుంబాలకు ‘మన టీవీ’ ప్రసారాలను చేర్చడం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సాఫ్ట్‌నెట్ సీఈఓ శైలేశ్‌రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మన టీవీ ద్వారా గ్రూప్-2 అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రస్తుతం రిసీవర్ టెర్మినల్స్ (ఆర్‌ఓటీ) ద్వారా మన టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయన్నారు. వీటిని కేబుల్ నెట్వర్క్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా.. అక్టోబర్ ఒకటో తేదీన రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఇందులో పాల్గొంటారని వెల్లడించారు. ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ప్రస్తుతమున్న నాలుగు చాన ళ్లకు అదనంగా.. మరో నాలుగు చానళ్ల ద్వారా కార్యక్రమాలను ప్రసారం చేసే వీలుంటుందన్నారు. ప్రస్తుతం విద్యార్థులు, యువతకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న మన టీవీ.. త్వరలో మహిళా, శిశు సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాలకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన, ప్రసారాలపై దృష్టి సారిస్తుందన్నారు. -
త్వరలో పురపాలక శాఖతో ఇస్రో ఒప్పందం
-
'త్వరలో పురపాలక శాఖతో ఇస్రో ఒప్పందం'
హైదరాబాద్ : మన టీవీ ద్వారా గ్రూప్ - 2 శిక్షణా తరగతులు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రసారం అవుతాయని తెలంగాణ ఐటీ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మన టీవీ ద్వారా రోజుకు 4 గంటలు గ్రూప్ - 2 శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే సివిల్స్‌తోపాటు ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు. బుధవారం హైదరాబాద్‌లో గ్రూప్ - 2 కోచింగ్ మనటీవీ ద్వారా ప్రసారం చేసేందుకు ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై మంత్రి కేటీఆర్, ఇస్త్రో ప్రతినిధులు సంతాకాలు చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... అక్టోబర్ 14 నుంచి 6 వేల స్కూళ్లలో డిజిటల్ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే శాటిలైట్ పరిజ్ఞానం ద్వారా భూగర్భ జలాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. త్వరలో పురపాలక శాఖతో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ... గ్రామీణ విద్యార్థులకు ఈ గ్రూప్ - 2 శిక్షణ మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
'యువతకు ఉపయోగపడేలా మన టీవీ కార్యక్రమాలు'
- ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ హైదరాబాద్: ప్రభుత్వం నడిపిస్తున్న 'మన టీవీ' ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకులకు ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రైతులకు, గృహిణులకు ఉపయుక్తంగా ఉండేలా కార్యక్రమాలుండాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి ప్రకటన విడుదల చేశారు. పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్న మనటీవీకి కొత్త పేరు, లోగోను సూచించాలని సీఈఓ శైలేష్‌రెడ్డి కోరారు. మంచి పేరు, లోగో సూచించిన వారికి రూ.51 వేల బహుమతి అందిస్తామని ప్రకటించారు. పేరు, లోగోలను ఐటీ శాఖ వెట్సైట్లో లేదా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంగణంలోని మనటీవీ కార్యాలయంలో నేరుగా కానీ, పోస్టు ద్వారా కానీ సమర్పించవచ్చని తెలిపారు. -
‘మన టీవీ’కి కొత్తరూపు
* చానల్స్ పెంచే యోచన * శాటిలైట్ మార్పుపై నేడు ఇస్రోతో చర్చలు సాక్షి, హైదరాబాద్: పాఠశాలతో పాటు సాంకేతిక, ఉన్నత విద్య బోధనలో కీలకంగా పనిచేస్తున్న అధికారిక చానల్ ‘మన టీవీ’ ప్రసారాలకు కొత్త రూపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోం ది. ప్రస్తుతం ‘జీ శాట్-8’ ఉపగ్రహం ద్వారా మన టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతుండగా.. ‘జీ శాట్-15’లోకి మార్చాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్‌తో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ‘సాఫ్ట్‌నెట్’ (సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్) ద్వారా మన టీవీ కార్యక్రమాలు ప్రస్తుతం 4 చానల్స్ ప్రసారం అవుతున్నాయి. వీటి సంఖ్యనూ పెంచాలని ప్రభుత్వం యో చిస్తోంది. అయితే ప్రసారాలను నిర్దేశిత గ్రూపులకు చేరవేసేందుకు సాఫ్ట్‌నెట్ అనేక సాంకేతిక అవరోధాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో శాటిలైట్ మార్పు ద్వారా దూరదర్శన్ తరహాలో అందరికీ మనటీవీ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కాగా, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, మాతా శిశు సంక్షేమం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, పోటీ పరీక్షలు తదితరాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామని మన టీవీ సీఈఓ శైలేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
టెన్త్ విద్యార్థులకు లైవ్ పాఠాలు!
‘మన టీవీ’ ద్వారా కార్యక్రమాల ప్రసారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ పాఠ్యాంశాలపై బోధన అందించడంతోపాటు విద్యార్థులు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ‘లైవ్ టీవీ’ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం నిర్వహించే మన టీవీ ద్వారా లైవ్ పాఠాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రతి రోజు లైవ్ పాఠాలు బోధించడంతోపాటు రికార్డు చేసిన రెండు పాఠాలను చెబుతారు. లైవ్‌లో టీచర్ బోధిస్తున్నప్పుడు అనుమానాలు వస్తే నివృత్తి చేసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబరుకు ఫోన్ చేస్తే లైవ్‌లోనే వారి అనుమానాలను నివృత్తి చేస్తారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రాష్ట్రంలోని 2,408 ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం మన టీవీ కార్యక్రమాలను వీక్షించేందుకు ఏర్పాట్లు ఉన్నందున, వాటన్నింటికి ఈ సదుపాయాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డెరైక్టర్ ఎస్.జగన్నాథరెడ్డి చెప్పారు. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు పాఠ్యాంశాన్ని బోధిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.45 నుంచి 2.30 గంటల వరకు లైవ్ పాఠాల కార్యక్రమం ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు వీటిని చూపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రికార్డెడ్ పాఠాలను ప్రతి రోజు ఉదయం 10:15 గంటల నుంచి 11:15 గంటల వరకు బోధిస్తారు. సోమవారం తెలుగు, మంగళవారం హిందీ, బుధవారం ఇంగ్లిష్, గురువారం గణితం, శుక్రవారం సైన్స్, శనివారం సాంఘిక శాస్త్రం పాఠాలను మన టీవీ ద్వారా బోధిస్తారు. సులభంగా అర్థమయ్యేలా వీడియో క్లిప్పింగ్స్, యానిమేషన్‌తో కూడిన బొమ్మలను చూపుతారు. అన్ని పాఠశాలల్లో అమల్లోకి తెచ్చేలా.. రాష్ట్రంలో ప్రస్తుతం 5,617 ఉన్నత పాఠశాలలు ఉండగా, మన టీవీ కార్యక్రమాలు వీక్షించే సదుపాయం 2,408 పాఠశాలల్లో ఉంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మిగతా వాటిలోనూ ఈ కార్యక్రమాల కోసం టీవీ, డిష్ యాం టెన్నా, సెట్ టాప్ బాక్సులను కల్పించేందుకు విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా మన టీవీ కార్యక్రమాలను విద్యార్థులు వీక్షించేందుకు వీలుగా 6 నుంచి 10వ తరగతి వరకు అకడమిక్ కేలండర్‌లోనూ ప్రత్యేకంగా సమయం కేటాయించి జూలై నుంచి మార్చి వరకు పీరియడ్లను పొందుపరించింది.