'త్వరలో పురపాలక శాఖతో ఇస్రో ఒప్పందం'
హైదరాబాద్ : మన టీవీ ద్వారా గ్రూప్ - 2 శిక్షణా తరగతులు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రసారం అవుతాయని తెలంగాణ ఐటీ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మన టీవీ ద్వారా రోజుకు 4 గంటలు గ్రూప్ - 2 శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే సివిల్స్తోపాటు ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు. బుధవారం హైదరాబాద్లో గ్రూప్ - 2 కోచింగ్ మనటీవీ ద్వారా ప్రసారం చేసేందుకు ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పంద పత్రాలపై మంత్రి కేటీఆర్, ఇస్త్రో ప్రతినిధులు సంతాకాలు చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... అక్టోబర్ 14 నుంచి 6 వేల స్కూళ్లలో డిజిటల్ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే శాటిలైట్ పరిజ్ఞానం ద్వారా భూగర్భ జలాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. త్వరలో పురపాలక శాఖతో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ... గ్రామీణ విద్యార్థులకు ఈ గ్రూప్ - 2 శిక్షణ మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.