‘మన టీవీ’ ప్రసారాలకు ఎంఎస్‌వో ఆమోదం
⇒ పోటీ పరీక్షల కోసం తొలి చానల్..
⇒ నేటి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు
⇒ ప్రసారాల ప్రణాళిక వెల్లడించిన సీఈవో శైలేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘మన టీవీ చానల్’ కార్యక్రమాలను కేబుల్ ద్వారా ప్రసారం చేసేందుకు రాష్ట్రంలోని ఎంఎస్‌వోలు అంగీకరించారు. కేబుల్ ప్రసారాలకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం హామీ ఇచ్చింది. శనివారం మన టీవీ కార్యాలయం ప్రాంగణంలో కేబుల్ ద్వారా మన టీవీ కార్యక్రమాల ప్రసారానికి సంబంధించి ఎంఎస్‌వోల సమావేశం జరిగింది.
మన టీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎంఎస్‌వోలు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారిగా పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఘనత ‘మన టీవీ’కి దక్కుతుందని శైలేశ్‌రెడ్డి వెల్లడించారు. పేదలు, మారుమూల ప్రాంతాలకు చెందిన యువత, విద్యార్థులకు చేరడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకరించాల్సిందిగా కోరారు. మనటీవీ ద్వారా ఆదివారం నుంచి గ్రూప్-2 అభ్యర్థుల కోసం ఉదయం 10 నుంచి 10.50 వరకు రసాయన శాస్త్రం, 11 నుంచి 11.50 వరకు సమాజ నిర్మాణం, మధ్యాహ్నం 12 నుంచి 12.50 వరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఒంటి గంట నుంచి 1.50 వరకు రాజనీతి శాస్త్రం (పాలిటీ) అంశాలపై ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని వెల్లడించారు.
మన టీవీకి ఎంఎస్‌వోల సహకారం
మన టీవీ కార్యక్రమాలను కేబుల్ నెట్‌వర్క్ ద్వారా ప్రసారం చేసేందుకు ఎంఎస్‌వోలు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు సహకరిస్తామని ఎంఎస్‌వోల సంఘం ప్రతినిధి ఎం.సుభాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 60 మంది ఎంఎస్‌వోలు, 15 వేల మంది లోకల్ ఎంఎస్‌వోల ద్వారా సుమారు 90 లక్షల కుటుంబాలకు కేబుల్ ప్రసారాలు చేరవేస్తున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
మన టీవీ కార్యక్రమాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని ఆర్‌వీఆర్ కేబుల్ ప్రతినిధి ఫణికృష్ణ సూచించారు. యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో తాము భాగస్వాములవుతామని హాత్‌వే ప్రతినిధి ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సహకరిస్తామని సిటీ కేబుల్ ఎండీ శివరామకృష్ణ చెప్పారు.