సాక్షి, విజయవాడ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన కొత్త టారిఫ్ ఈ నెల 29 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని తెలంగాణ ఎమ్మెస్వో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఏపీ, తెలంగాణ ఎమ్మెస్వోలు బుధవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెస్వో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లు అతి తక్కువ ధరకే 200 నుంచి 300 ఛానల్స్ అందిస్తున్నారని, సుప్రీం కోర్టు తీర్పుతో ప్రేక్షకులపై అధిక భారం పడుతుందన్నారు.
ఎమ్మెస్వోలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం రూ.40కే అందిస్తున్నారని, కోర్టు నిర్ణయంతో పే ఛానల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఛానల్స్ అన్ని ఫ్రీ టు ఎయిర్ అయ్యేవరకు ప్రేక్షకులు సహకరించాలని కోరారు. పే చానల్స్‌ను చూడడం తగ్గిస్తే వాళ్లే దారికొస్తారని చెప్పారు. ఏపీ ఎమ్మెస్వో అసోషియేషన్ గౌరవాధ్యక్షుడు కడియల బుచ్చి బాబు మాట్లాడుతూ..సుప్రీం టారిఫ్‌ని అమలు చేస్తే ప్రేక్షకులపై రూ.600 భారం పడుతుందన్నారు. టారిఫ్‌పై ప్రేక్షకులకు, ఆపరేటర్లకు అవగాహన లేదని, కేంద్రం కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెమిని, ఈటీవి ,మాటీవి, జీ టీవి నుండి ఒక్కో ఛానల్ ని మాత్రమే ప్రేక్షకులకి అందించబోతున్నామని చెప్పారు. మిగతా చానళ్లని నిలిపివేస్తున్నామని ప్రకటించారు. రేపు డిల్లీకి వెళ్లి ఎమ్మెస్వోల తరఫున కేంద్రప్రభుత్వానికి మెమొరాండం అందిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment