కామారెడ్డి క్రైం: నిబంధనలను తుంగలో తొక్కి దందా చేస్తున్న పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. డబుల్ రిజిస్ట్రేషన్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఒకే స్థలాన్ని వేరువేరు వ్యక్తులకు అమ్ముతున్నారు. అధికారులు వారితో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుండడంతో సామాన్యులు నష్టపోతున్నారు. వెంకటస్వామి అనే వ్యక్తి గ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో పొట్టచేతబట్టుకుని 15 ఏళ్ల క్రితం కామారెడ్డికి వలస వచ్చాడు. రాత్రనక, పగలనక కష్టపడి కొన్ని డబ్బులు పోగు చేశాడు. సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం దేవునిపల్లి శివారులో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. భూమి పూజ చేయగానే ఓ వ్యక్తి ‘‘ఇది నా స్థలం’’ అంటూ అడ్డుకున్నాడు. దీంతో వెంకటస్వామి ఈ విషయమై స్థలాన్ని అమ్మిన వ్యక్తిని నిలదీశాడు. సదరు రియల్టర్ స్పందించకపోవడంతో మనస్తాపం చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. స్థానికులు అడ్డుకుని అతడిని కాపాడారు. ఈ సంఘటన ఇటీవల కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఇలా ఎంతో మంది అమాయక ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మి నిలువునా దోపిడీకి గురవుతున్నారు.
జిల్లా కేంద్రంలో తరచూ రియల్ ఎసేŠట్‌ట్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలు ప్లాట్లు కొనుగోలు చేసేవారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సొంతింటి కలను నెరవేర్చుకునే క్రమంలో రూ. లక్షల్లో నష్టపోతున్నారు. దీంతో కొత్త వ్యక్తి దగ్గర స్థలం కొనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు. అక్రమార్కులతో సంబంధిత అధికారులూ కుమ్మక్కవ డం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
బై నంబర్లతో డబుల్ రిజిస్ట్రేషన్‌లు
అక్రమార్కులు ఒక స్థలానికి సంబంధించిన సర్వే నంబర్లకు బై నంబర్లు వేస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఒక స్థలాన్ని మొదట ఒక వ్యక్తికి అమ్మిన తర్వాత తిరిగి అదే స్థలాన్ని ఈ పద్ధతిలో సృష్టించిన డాక్యుమెంట్లతో మరొకరికి విక్రయిస్తున్నారు. ఒక స్థలాన్ని ముగ్గురు నలుగురికి విక్రయించిన ఉదంతాలూ ఉన్నాయి. సామాన్య ప్రజలకు డాక్యమెంట్ల విషయంలో సరైన అవగాహన ఉండదు. దీనిని మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. లింక్ డాక్యుమెంట్లు పక్కాగా ఉంటేనే ప్లాట్లుగానీ, ఇతర స్థలాలు గానీ కొనుగోలు చేయాలనే విషయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
అధికారుల అండతోనే!
ఒకేస్థలాన్ని చూపించి ఇద్దరు ముగ్గురికి అంటగడుతున్న మోసగాళ్లకు అధికారుల అండ ఉందన్న ప్రచారం జరుగుతోంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూశాఖల అధికారులు నకిలీ డాక్యుమెంట్ల సృష్టి, ఆన్‌లైన్ వ్యవహారాల్లో అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లకు సంబంధించిన రికార్డులు ముందుగానే ఆన్‌లైన్‌లో వచ్చేలా ఎంట్రీ చేస్తూ రిజిస్ట్రేషన్‌లు పూర్తికాగానే ఆన్‌లైన్‌లోనుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లోౖ నెతే సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయాల్లోనే బై నంబర్లు సృష్టిస్తూ అక్రమ రిజి స్ట్రేషన్‌లకు పాల్పడుతున్నారని సమాచారం.
సెటిల్‌మెంట్ల పేరుతో గుంజుడు..
డబుల్ రిజిస్ట్రేషన్‌లు, నకిలీ పత్రాలతో స్థలాలు కొని మోసపోయిన వారు ఇదేమిటని ప్రశ్నిస్తే.. తప్పించుకోవాలని చూస్తున్నారు. పదేపదే అడిగితే సెటిల్‌మెంట్ల పేరుతో మరింత గుంజుతున్నారు. చేసేదిలేక, ఎదిరించలేక బాధితులు ఎంతోకొంతో ముట్టజెబుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతోనైనా ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుందా అన్నది తేలాల్సి ఉంది. సర్వేనంబర్ల విషయంలో బైనంబర్లను తొలగించడం, ఒకే నంబరు విధానాన్ని తీసుకువస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.
తప్పుగా ఉంటే తిరస్కరిస్తున్నాం
వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు వస్తే వాటిని తిరస్కరిస్తున్నాం. ఎలాంటి లొసుగులు ఉన్నా తిరస్కరించి కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నాం. కోర్టు ద్వారా ఏదైనా అడిగితే సమాచారాన్ని కోర్టుకే నేరుగా ఇస్తాం. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – మల్లికార్జున్, సబ్‌రిజిష్ట్రార్, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment