రైతుల ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ–నామ్ విధానాన్ని అమలు చేస్తోంది. పంటలను దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలుదారులు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేలా ఈ విధానాన్ని నిజామాబాద్ శ్రద్దానంద్‌గంజ్‌లో అమలు చేస్తోంది. ఇలాంటి ఈ–నామ్ విధానం ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు ఎగనామం పెడుతున్నారు. యథేచ్ఛగా పసుపు జీరో దందాకు తెరలేపారు. మార్కెట్‌యార్డుకు వస్తున్న పసుపును ఈ–నామ్ విధానంలో నమోదు చేయకుండా నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఈ పసుపును తమ ఫ్యాక్టరీలకు తరలించి పన్ను ఎగవేస్తున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పసుపుపై ఐదుశాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం పసుపు ధర క్వింటాలుకు సగటున రూ.7000 పలుకుతోంది. ఇలా వంద క్వింటాళ్ల పసుపు విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుంది. ఈ మొత్తంపై జీఎస్టీ ఐదు శాతం చొప్పున రూ.35 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒక శాతం చొప్పున మార్కెట్ ఫీజు రూ. ఏడు వేలు. ఈవిధంగా మొత్తం వంద క్వింటాళ్ల పసుపుపై రూ.42 వేలు చెల్లించాలి. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డుకు గుంటూరు జిల్లా దుగ్గిరా ల, అనంతపూర్, కడప, కర్నూలు జిల్లాలో మైదుకూరు వంటి ప్రాంతాల నుంచి పసుపు వస్తోంది. గతేడాది కొనుగోలు చేసి నిల్వ చేసిన పసుపును వ్యాపారులు నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు తెచ్చి విక్రయిస్తున్నా రు. ఈ పసుపును ఈ–నామ్‌లో నమోదు చేయకుండా కొందరు వ్యాపారులు నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఇలా జీరోలో కొనుగోలు చేసిన పసుపును తరలించి పన్ను ఎగవేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు వెయ్యి క్వింటాళ్ల వరకు పాత పసుపు మార్కెట్‌యార్డుకు వస్తోంది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో జీరో దందాకు తెరలేచింది.
ఎగవేత జరుగుతోంది ఇలా..
రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెట్‌యార్డుకు తెస్తే ముందుగా యార్డ్ ఇన్‌గేట్ వద్ద సరుకు, రైతు, కమీషన్ ఏజెంట్ వివరాలను నమోదు చేస్తారు. సరుకు ప్లాట్‌ఫాం మీద కుప్ప పోశాక మార్కెట్ సిబ్బంది వచ్చి లాట్ నెంబరు కేటాయిస్తారు. కొనుగోలుదారులు ఈ సరుకు కుప్పలను పరిశీలించి లాట్ నెంబర్లను ఆధారంగా ఆయా సరుకుకు ధరను ఈనామ్ పోర్టల్ ఆన్‌లైన్ లో కోట్ చేస్తారు. ఎక్కువ ధరకు కోట్ చేసిన వ్యాపారికి సరుకును తూకం వేసి ఇస్తారు. ఈ మేరకు వ్యాపారి రైతులకు డబ్బులు చెల్లిస్తారు. అయితే ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి వస్తున్న పసుపును ఈనామ్ విధానంలో నమోదు చేయడం లేదు. నేరుగా కొనుగోలు చేసి మార్కెట్‌యార్డు నుంచి బయటకు తరలిస్తున్నారు. దీం తో జీఎస్టీతో పాటు, ఇటు మార్కెట్‌ఫీజుకు కూడా ఎగనామం పడుతోంది. మార్కెట్ ఫీజు ఎగవేత విషయమై ‘సాక్షి’ మార్కెటింగ్‌శాఖ గ్రేడ్–2 కార్యదర్శి రవీందర్ వివరణ కోరగా.. తాను ఇన్‌చార్జిగా ఉన్నానని, రెండు రోజు ల్లో విధుల్లో చేరనున్న కార్యదర్శిని సంప్రదించాలని సెలవిచ్చారు. తనకేమీ తెలియదన్నారు. జీఎస్టీ ఎగవేత విషయమై రాష్ట్ర పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ నర్సింహరావు వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి అను మతి ఉంటేనే తాము తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment