లండన్: మీ అందరికి శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ చెప్పే డైలాగ్ గుర్తుంది కదా... చాలా ఇచ్చింది మా ఊరు తిరిగివ్వక పోతే లావైపోతానంటూ ఆమె చెప్పిన డైలాగ్‌ను ఐదేళ్ల వయసులోనే ఓ బుడతడు ఆచరించి చూపిస్తున్నాడు. లిటిల్ పెడ్లర్స్ అనీష్ అండ్ హిస్ ఫ్రెండ్స్.. 30 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్ పేరుతో ఒక ఫండ్ రైసింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తన మాతృభూమి భారతదేశం కోసం ఈ చిన్నారి నిధులను సేకరిస్తున్నాడు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు సాయం అందించడానికి ఈ నిధులను సేకరిస్తున్నారు. తల్లిదండ్రుల సహకారంతో ఈ బుడతడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ బాలుడి పేరు కుంచల ఆశిన్వర్. చిత్తురు జిల్లాకు చెందిన స్నేహ, అనిల్ దంపతుల కుమారుడు. వీరి కుటుంబం ఇంగ్లండ్‌లోని వర్రింగ్టన్లో స్థిరపడింది.
క్రికెట్ అంటే ప్రాణం పెట్టే అనీశ్వర్, గతంలో అదే ఆటతో వైద్యుల కోసం ముందడగు వేసి నిధులను సేకరించాడు. ఏకంగా 400 ఓవర్లు క్రీజులో నిలిచి తనకి ఏడాది వయసులో ఎదురైన అనారోగ్యానికి చికిత్స అందించిన వైద్యుల సహాయ నిధికి విరాళాలు అందించాడు. ఇప్పుడు తన స్నేహితులతో కలిసి గివ్ ఇండియా పేరుతో సైక్లింగ్ చాలెంజ్‌ను మొదలుపెట్టి, "లిటిల్ పెడ్లర్స్ అనీష్ అండ్ హిస్ ఫ్రెండ్స్.. 30 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్" అంటూ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు
ఆరుగురు చిన్నారులతో మొదలైన ఈ ఛాలెంజ్.. పదిరోజుల్లో లక్షా ఎనిమిదివేల రూపాయాలు సేకరించినట్లు అనీష్ తల్లిదండ్రులు తెలిపారు. ఇంకా 20 రోజులు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. చిన్నారులందరితో కలిసి సైక్లింగ్ చేస్తూ ఈ మాతృభూమి కోసం ఈ నిధులను సేకరిస్తున్నారు. మాతృ దేశానికి కష్ట కాలంలో అండగా నిలుస్తామన్న సంతృప్తి అనీశ్వర్‌తో పాటు తమకూ కలుగుతుందని చిన్నారులు, వారి తల్లి దండ్రులు చెబుతున్నారు. సైక్లింగ్ తో భారత్‌కు అండగా నిలబడుతున్న ఈ బుడ్డోడిని పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే బాధ్యత పిల్లల్లో పెరుగుతుందని అశీష్ తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment