డల్లాస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఘనంగా నిర్వహించింది. డల్లాస్‌లోని మినర్వా బాంక్వెట్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు 300కు పైగా మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రీజనల్ కో ఆర్డినేటర్లు అశోక్ పొద్దుటూరి, మాధవి సుంకిరెడ్డి అతిథులను ఆహ్వానించగా... మధుమతి వైశ్యరాజు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాలికలు ప్రార్థనా గీతంతో పాటు భారత, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. ఆ తర్వాత సభికులంతా పుల్వామా ఉగ్రదాడి అమరజవాన్లకు నివాళులర్పించారు.
ఈ క్రమంలో వివిధ రంగాల్లో దూసుకుపోతున్న వుమెన్ ప్రొఫెషనల్స్ డాక్టర్ సెజల్ మెహతా(సైకియాట్రిస్ట్), డాక్టర్ శ్రీవిద్య శ్రీధర(ఇమ్యూనాలజిస్ట్), సునీత చెరువు(ఫ్రిస్కో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్), శ్రీ తిన్ననూరు(ఐటీ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్)లతో మాధవి లోకిరెడ్డి ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. తమ విలువైన అనుభవాలు పంచుకున్నందుకు, సలహాలు అందించినందుకు సుమన బీరం, శ్వేత పొద్దుటూరి వీరికి ధన్యవాదాలు తెలిపారు.
ఆటపాటలు.. పండుగ వాతావరణం
మహిళా దినోత్సవంలో భాగంగా ఆటా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా బాలికలు తమ ప్రతిభకు పదును పెడుతూ పోటాపోటీగా ఆటపాటలతో అలరించారు. ఈ క్రమంలో మహిళలు సైతం పోటీకి సై అంటూ నృత్యాలు చేయడంతో సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం సంధ్య గవ్వ, అనురాధ మేకల గేమ్స్ కండక్ట్ చేసి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
ఇక ఆటా నేతృత్వంలో జరిగిన ఈ తొమ్మిదో మహిళా దినోత్సవానికి శ్రీలతా సూరి(కూచిపూడి డాన్సర్), ఇందు మందాడి(ఐఏఎన్‌టీ మాజీ ప్రెసిడెంట్), తృప్తి దీక్షిత్(ఒమేగా ట్రావెల్స్ సీఈఓ) తదితర వివిధ రంగాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. సంధ్య గవ్వ, అరవింద్‌రెడ్డి ముప్పిడి (కోశాధికారి), రఘువీర్ బండారు, సతీశ్ రెడ్డి, అజయ్ రెడ్డి, అశోక్ కొండాల, రామ్ అన్నాడి, మహేందర్ ఘనపురం, కవితా కడారి సూచనలతో, శారద సింగిరెడ్డి, సుధాకర్ కలసాని, శ్రీకాంత్ కొండ, మధుమతి వైశ్యరాజు, సుమర బీరం, అనురాధ మేకల, మంజుల ముప్పిడి, శ్వేతా పొద్దుటూరి, అశ్విన్ ఆయంచ, దామోదర్ ఆకుల, రవికాంత్ మామిడి, భాస్కర్ అర్రోజుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు రీజనల్ కో ఆర్డినేటర్లు మాధవి సుంకిరెడ్డి, అశోక్ పొద్దుటూరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment